మైనర్‌ బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

By సుభాష్  Published on  27 Aug 2020 10:57 AM GMT
మైనర్‌ బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

దేశంలో మైనర్‌ బాలికలపై, మహిళలపై, వృద్దులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం సంచలనంగా మారింది. పైగా యూపీలో మహిళలపై అఘాయిత్యాలు అధికంగానే జరుగుతుంటాయి.

గ్రేటర్‌ నోయిడాలో రెండు రోజుల కిందట ఓ మైనర్‌ బాలిక (12)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. నోయిడాలోని ఎకోటెక్‌-3 పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. మంగళవారం రోజువారీగా తల్లిదండ్రులు పనులకు వెళ్లగా, బాలిక ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు ఫేస్‌ మాస్క్‌ ధరించడం, అతన్ని మొదటిసారిగా చూడటం బాలిక నిందితున్ని గుర్తు పట్టలేకపోయింది.

ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు నిందితున్ని గుర్తించడం సవాల్‌గా మారింది. ఈ కేసులో పలు పోలీసు బృందాలు రంగంలోకి దిగి చివరకు నిందితుడి ఆచూకీ గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లగా, నిందితుడు పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్నట్లు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ బృందా శుక్లా మీడియాకు వివరించారు. కాల్పుల్లో గాయపడిన నిందితున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం, కోర్టులో హాజరు పర్చామని, పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాని ఆమె వెల్లడించారు.

కాగా, దేశంలో రోజురోజుకు ఇలాంటి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. బాలికలు, మహిళలపై దారుణాలు పెరిగిపోతుండటంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అడ్డదారులు దొక్కే కొందరు ఇలాంటి దారుణాలకు పాల్పడి కటకటాల పాలవుతున్నారు.

Next Story