వేధింపు ఘటనలపై అమ్మాయిలు గొంతెత్తాలి

By అంజి  Published on  20 Feb 2020 10:34 AM GMT
వేధింపు ఘటనలపై అమ్మాయిలు గొంతెత్తాలి

రాజన్నసిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని కేటీఆర్‌ సందర్శించారు. వసతి గృహంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికలపై వేధింపులకు పాల్పడ్డ తమ పార్టీ నాయకులను సస్పెండ్‌ చేశామని, వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలపై అమ్మాయిలు గొంతెత్తాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పంచాయితీరాజ్‌ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలనను సులభతరం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ప్రజలకు చేరువలో ప్రభుత్వ పాలన ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాల ద్వారా అధికార యంత్రాంగం ప్రజలకు మరింత చేరువైందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చూడాలన్నారు.

గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చామని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందన్నారు. ఇందు కోసమే కొత్త పంచాయతీ, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చామన్నారు. ఎంతో మేధోమథనం ఉన్న సీఎం కేసీఆర్‌ పంచాయితీరాజ్‌ చట్టాన్ని తయారు చేశారని తెలిపారు. గ్రామీణ జీవితాన్ని ఒక్క సీఎం కేసీఆరే సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారని అన్నారు. కేసీఆర్‌.. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక గంటలో 10 వేల మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిగ్రామంలో వైకుంఠధామం ఉండాలని అన్నారు. పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Next Story