మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sep 2020 1:24 PM GMT
మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్‌

ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆ మహమ్మారిని జయించారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్థారణ అయింది. ఈనెల 5న కరోనా లక్షణాలు ఉండడంతో.. పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను కలిసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సిద్దిపేట జిల్లా ప్రజలు ఆకాంక్షించిన విష‌యం విదిత‌మే. శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 2,278 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 1,21,925 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 32,005 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఈ మహమ్మారి బారిన పడి 950 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story