కరోనాపై అతిగా స్పందించొద్దు..
By Newsmeter.Network Published on 5 March 2020 5:01 PM IST
తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయ్‌లో కరోనా సోకిందన్నారు. ఆ వ్యక్తిని రెండు రోజుల్లో డిశ్బార్జి కావొచ్చు అని తెలిపారు. మైండ్‌స్పేస్ ఉద్యోగికి కరోనా నెగిటివ్ వచ్చిందని, కరోనాపై అతిగా స్పందించొద్దని సూచించారు. కరోనా వచ్చిందంటూ ఒక సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని ఖాళీ చేసిన ఘటన స్పందిస్తూ.. ఐటీ కంపెనీలు బాధ్యతతో వ్యవహరించాలన్నారు.
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్రం తీసుకున్న చర్యలను చూసి కేంద్రం కితాబు ఇచ్చిందని మంత్రి తెలిపారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా కరోనా రాకూడదని కోరుకుందామని అన్నారు. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఈటల స్పష్టం చేశారు.