తెలంగాణలో ఐదు కరోనా కేసులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2020 1:24 PM GMT
తెలంగాణలో ఐదు కరోనా కేసులు..

రాష్ట్రంలో ఐదు కరోనా (కొవిడ్‌-19) కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వారందరూ కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికీ కరోనా వైరస్ సోకలేదని మరోమారు స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించి ఇకపై రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామన్నారు.

దుబాయ్‌, ఇటలీ, నెదర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు విమానాశ్రయంలోనే స్ర్కీనింగ్‌ చేస్తున్నామని తెలిపారు. వైరస్‌ అనుమానం ఉన్నవారు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలన్నారు. మొదటి కరోనా పాజిటివ్‌ వ్యక్తితో పాటు రెండవ, మూడవ కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో సంబంధం ఉన్న ఎవరికీ వైరస్‌ సోకలేదని చెప్పారు. కరోనా అదుపుకోసం వైద్య సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు.

కరోనా లక్షణాలు లేనివారిని దూలపల్లి, వికారాబాద్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు అన్ని ఏర్సాట్లు చేశామన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 221మందిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఈటల వివరించారు.

హైదరాబాద్‌లోని ఫీవర్‌, గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తుది పరీక్షల కోసం ఇప్పటి వరకు పుణె పంపించాల్సి వచ్చేదని.. ఇకపై హైదరాబాద్‌లోనే తుది పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల చెప్పారు. కరోనా పరీక్షలకు రాష్ట్రంలో 6 ల్యాబ్‌లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయన్నారు.

Next Story