క‌రోనా ఎఫెక్టు.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ఆరుగురిలో ఒక‌రి ఉద్యోగం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2020 12:33 PM GMT
క‌రోనా ఎఫెక్టు.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ఆరుగురిలో ఒక‌రి ఉద్యోగం..

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఇప్ప‌టికే ల‌క్ష‌కు పైగా మంది మ‌ర‌ణించ‌గా.. 16 ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి చాలా రంగాలు కుదేల‌య్యాయి. ఇంకా ఈ మ‌హ‌మ్మారికి మందు క‌నిపెట్ట‌లేదు. దీంతో చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. ప్ర‌జ‌లు ఇళ్లు ధాటి బ‌య‌టికి రావ‌డం లేదు.

లాక్‌డౌన్ దెబ్బ‌కి దాదాపు అన్ని ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ఎప్ప‌టికి ఈ మ‌హ‌మ్మారి ముప్పు తొలిగిపోతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు కొన్ని వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంతో నెట్టుకొస్తున్నా.. చాలా రంగాల‌కు అలాంటి అవ‌కాశం లేదు.

16ల‌క్ష‌ల మంది ప‌నిలేక తీవ్ర ఇబ్బందులు..

ఇక బ్రిట‌న్ లో ఈ మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చాలా రంగాలు మూత బ‌డ్డాయి. ఇప్ప‌టికే 16 ల‌క్ష‌లు కార్మికులు ప‌నిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రి ఉద్యోగం పోతుంద‌ట‌. బ్రిటన్‌లో 3.2కోట్ల మంది ఉద్యోగాలు చేస్తుండ‌గా.. 56ల‌క్ష‌ల మంది ఉద్యో‌గాలకు ముంపు పొంచి ఉంద‌ని ‘న్యూ ఎకనామిక్స్‌ ఫౌండేషన్‌’ అంచనా వేసింది.

తాజాగా బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఓ స్కీమ్‌ను రూపొందించింది. కంపెనీలు జీతాలు చెల్లించ‌ని ప‌రిస్థితుల్లో 80 శాతం వేత‌నాలు చెల్లించ‌నుంది. ఇందుకోసం 312ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేటాయించింది. నిర్దిష్ట కాల పరిమితి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులను కంపెనీలు తీసివేసిన పక్షంలో వారికి ఈ ప్రభుత్వం స్కీమ్‌ వర్తించదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

భార‌త్‌లోనూ ఉద్యోగాల కోత‌..

ఇక భార‌త్‌లోనూ ఉద్యోగాల కోత త‌ప్ప‌డం లేదు. ఈ వైర‌స్ కార‌ణంగా ఎక్కడిక్క‌డ ప్రాజెక్టులు ఆడిపోవ‌డంతో కంపెనీలు భారీ న‌ష్టాల‌తో విల‌విల‌లాడుతున్నాయి. ఉద్యోగుల జీత‌భ‌త్యాలు చెల్లించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నాయి. తాజాగా గురుగ్రామ్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఓ కంపెనీ 800 మంది ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ట్లు స‌మాచారం. ఈ కంపెనీకి అనుబంధంగా పూణేలో మ‌రో కంపెనీ ఉంది. దీంతో అక్క‌డా ఉద్యోగుల‌కు తొల‌గించారు. రాత్రికి రాత్రే మెయిల్ ద్వారా ఉద్యోగాలు తొల‌గించిన‌ట్లు స‌మాచారం. 10సంవ‌త్స‌రాల అనుభవం ఉన్న‌వారిని సైతం ఉద్యోగాల నుంచి తొలగించ‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది.

మ‌రికొంత కాలం ఈ లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే చాలా మంది ఉద్య‌గాలకు ఎస‌రు త‌ప్ప‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. అమెరికా లాంటి దేశం వైర‌స్ కార‌ణంగా విల‌విల‌లాడుతోంది. మ‌న‌దేశంలో ఐటీ ఆధారిత చాలా కంపెనీలకు అమెరికా, యూరప్ లాంటి దేశాల నుంచే క్లయింట్స్ ఉన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్రాజెక్టులు అయితే ఓకే కానీ.. కొత్త ప్రాజెక్టులు అయితే రావ‌డం క‌ష్ట‌మేన‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం కంపెనీల‌కు త‌ల‌కు మించిన భార‌మే అవుతుంద‌ని, కొంత‌లో కొంత‌నైనా ఆర్థిక భారాల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం కంపెనీలు త‌మ ఉద్యోగుల్లో కోత విధించ‌క త‌ప్ప‌ద‌ని ప‌లు కంపెనీల సీఈఓలు అంటున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ నెలాఖ‌రుకు నాటికి ఐటీ ఆధారిత రంగాల్లో ప‌దిల‌క్ష‌ల‌కుపైగా ఉద్యోగాల‌కు ఎస‌రు త‌ప్ప‌ద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Next Story
Share it