మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

By సుభాష్  Published on  8 May 2020 10:38 AM GMT
మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిమ్స్‌ వద్ద పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఆందోళన దిగారు. తమను సొంతూళ్లకు పంపించాలంటూ ధర్నాకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపై రాళ్లదాడికి దిగారు. ఎయిమ్స్‌ లోని సెక్యూరిటీ గదిలోకి ఆందోళనకారులు చొచ్చుకువచ్చి గదిలో ఉన్న ఫర్నిచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.

అయితే మంగళగిరి ఎయిమ్స్‌లో జార్ఖండ్‌, యూపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పని చేస్తున్నారు. ఇటీవల కేంద్రం వలస కూలీలను సొంతూళ్లకు పంపించేందుకు అనుమతి ఇవ్వడంతో వారు తమను సొంత ఊర్లకు పంపించాలంటూ పట్టుబట్టారు. అయితే మూడు రోజుల నుంచి అధికారులు స్వస్థలాలకు పంపిస్తామంటూ హామీ ఇచ్చినా ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి తరలిస్తుంటే ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో మంగళగిరి అడిషనరల్‌ ఎస్పీ ఈశ్వరయ్య ఘటన స్థలానికి చేరుకుని వలస కార్మికులతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉన్నందున రెడ్‌జోన్‌లో ఉందని, దీంతోనే కూలీలను అనుమతించేందుకు ఇతర రాష్ట్రాలు సుముఖంగా లేనందున తరలించడం లేదని అన్నారు. త్వరలోనే పంపించే ఏర్పాట్లు చేస్తామని కూలీలకు నచ్చజెప్పారు.

Next Story