మిథైల్ ఆల్కహాల్ తాగి 300 మంది మృతి
By సుభాష్ Published on 28 March 2020 3:31 AM GMTవాక్సిన్ లేకపోవడంతో కరోనా తమ జోలికి రాకుండా చూసుకోవాలి అంటే ఎవరు ఏది చెబితే అది ఆచరించేలా అయ్యింది ప్రజల పరిస్థితి. కరోనా వైరస్ నుండి తమను తాము రక్షించుకునేందుకు ఇండిస్టియల్ ఆల్కహాల్ అని పిలిచే మిథనాల్‌ను సేవించి 300 మందికిపైగా ఇరాని యన్లు మరణించారు. మరో వెయ్యిమందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. దీనితో కరోనా రాకుండానే నిష్కారణంగా 300 మంది తమ ప్రాణాలు కోల్పోయినట్టయంది.
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇక్కడ శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకగా 2400 మరణాలు నమోదయ్యాయి.
కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇరాన్‌లో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే ఈ సమయంలో కరోనా వైరస్ సోకకుండా జనం ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మెథనాల్ ను తాగడంతో ఇప్పటివరకు ఇరాన్‌లో 480 మంది మరణించగా, 1000 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఇరాన్ మీడియా తెలిపింది. ఆల్కహాల్‌తో కూడిన హ్యాండ్ శానిటైజర్ల వాడకంపై సాగిన ప్రచారంతో కొందరు అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్‌ను సేవిస్తే అది వైరస్‌ను చంపివేస్తుందనే అపోహతో మెథనాల్‌ను తీసుకుంటున్నారు.
నిజానికి మెథనాల్‌ను వాసన చూడటం, తాగడం చేయరాదని ఇది శరీర భాగాలపై దుష్ర్పభావం చూపడమే కాకుండా మెదడును ధ్వంసం చేస్తుందని, వ్యక్తులు కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ జీర్ణ వ‍్యవస్థను పరిశుద్ధం చేస్తుందనే ప్రచారంలో నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇరాన్‌లో మద్యపానంపై నిషేధం వుండటంతో దానికి అలవాటు పడిన కొంతమంది ఇండిస్టియల్ ఆల్కహాల్‌ను తీసుకోవడం మొద లెట్టారు. అదే సమయంలో కరోనా వైరస్ మిథనాల్ చక్కటి విరుగుడు అని సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలను నిజమేననుకుని ఈ ఆల్కహాల్‌ను పెద్దయెత్తున సేవించడంతో వారి ప్రాణాలకే ముప్పు వచ్చింది. కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కాకపోవడంతోనే పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇరాన్ అధికార యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రజలను తప్పుదోవ పట్టించే సందేశాలు సోషల్ మీడియాలో పెద్దయెత్తున వస్తున్నాయి. విస్కీలో తేనె కలిపి తాగితే కరోనా వైరస్ దరి చేరదని ఇలా రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇటువంటి వాటివి నమ్మొద్దని వైద్య నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.