మెహ్రీన్ పై సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత..!
By రాణి Published on 25 Feb 2020 2:40 PM IST
మెహ్రీన్ కౌర్ పిర్జాదా తాజాగా నటించిన సినిమా 'అశ్వత్థామ' బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే..! ఆ సినిమా నిర్మాత శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ మెహ్రీన్ పై సంచలన ఆరోపణలు చేశారు. మెహ్రీన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించలేదని.. నిర్మాతలకు ఆమె భారమేనని ఆరోపించారు. మెహ్రీన్ ను సినిమాలో తీసుకోడానికి ముందు 30 రోజుల కాల్షీట్లు అడిగామని.. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఆమె పాల్గొనేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన అన్నారు. ఆమె మాత్రం కేవలం 15 రోజులు మాత్రమే సినిమా షూటింగ్ లో పాల్గొనిందని.. ప్రమోషన్స్ లో అసలు భాగస్వామి కాలేదని.. అయినా పూర్తి రెమ్యునరేషన్ చెల్లించామని చెప్పారు. చివరి ఇన్స్టాల్మెంట్ లో రూ.10 లక్షలను ఆమెకు చెల్లించాల్సి ఉండగా.. దాన్ని కూడా చెల్లించేశామని ఆయన అన్నారు.
మెహ్రీన్ ఆమె సిబ్బందికి సంబంధించిన బిల్లులు కూడా భారీగా చెల్లించామని ఆయన అన్నారు. ఫుడ్, లాండ్రీకి సంబంధించి పంపిన బిల్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయని.. వాటి గురించి తాము ఎప్పుడూ ప్రశ్నించలేదని చెప్పుకొచ్చారు. మెహ్రీన్ బస చేసే అదే హోటల్ లో ఆమె అసిస్టెంట్ కు కూడా రూమ్ వేయించారని.. అందుకు 6 లక్షల రూపాయలు ఖర్చయ్యాయన్నారు. హోటల్ సిబ్బందితో సత్సంబంధాలను కొనసాగించడానికి తాము ఆ బిల్లును కూడా చెల్లించినట్లు ఆయన అన్నారు. ఆమెను సినిమాలోకి తీసుకోబోయే ముందు చాలా మంది పలు రకాలుగా చెప్పారని.. అయినా కూడా వాటిని పట్టించుకుండా ఆమెను ఈ సినిమాకు సైన్ చేయించామని అన్నారు. చివరికి నాగ శౌర్యకు యాక్సిడెంట్ అయి షూటింగ్ క్యాన్సిల్ అయినప్పుడు తమకు కనీసం కాల్ చేసి ఏమైంది అని కూడా అడగలేదని ఆరోపించారు. షూటింగ్ ఆలస్యం అవుతోంది అని కోపాన్ని వ్యక్తపరిచిందని ఆరోపించారు శంకర ప్రసాద్. అత్యధికంగా హోటల్ బిల్స్ రావడం, ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడంపై ఆయన మెహ్రీన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు ఆరోపణలు అని తేల్చిన మెహ్రీన్
నిర్మాత చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని.. హోటల్ బిల్స్ మొత్తం తానే కట్టానని చెప్పారు. ప్రొడక్షన్ టీమ్ తన హోటల్ బిల్స్ ను కట్టేస్తుందని దాదాపు రెండు వారాల పాటూ ఎదురుచూశామని.. కానీ వాళ్ళు స్పందించకపోవడంతో నా మేనేజర్ మహేంద్ర మొత్తం బిల్స్ అన్నిటినీ కట్టేశాడని ఆమె చెప్పారు. హోటల్ మేనేజ్మెంట్ తనకు చాలా సార్లు కాల్ చేసి ప్రొడక్షన్ టీమ్ మీ హోటల్ బిల్స్ కట్టడానికి వెనుకాడుతోందని.. మీరే హోటల్ బిల్లును చెల్లించాలని అంటూ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ కోరినట్లు మెహ్రీన్ తెలిపారు.
సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా తమ మేనేజర్ కాల్స్ ను ప్రొడ్యూసర్స్ కనీసం లిఫ్ట్ చేయలేదని.. తన రిటర్న్ టికెట్స్ కూడా వారు వేయలేదని చెబుతోంది మెహ్రీన్. తనకూ, తన తల్లికి మేనేజరే టికెట్స్ బుక్ చేశాడని మెహ్రీన్ చెప్పారు. ప్రతి ఒక్క ఆర్టిస్టుకు స్టైలిస్ట్ అవసరమని.. తాను సాధారణమైన వస్త్రాలు ధరిస్తే సినిమాలో బాగా కనిపించనని చెప్పారు మెహ్రీన్. తనపై వచ్చిన చాలా ఆరోపణలకు సంబంధించిన వార్తలను చదివానని.. ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వకపోతే చాలా ప్రమాదం అని గ్రహించానని.. అందుకే అఫీషియల్ గా అన్నిటికీ క్లారిటీ ఇచ్చానని మెహ్రీన్ చెబుతున్నారు. నా వైపు నుండి కూడా ఏమి జరిగిందో చెప్తేనే నిజాలు బయటకువస్తాయని ఆమె తెలిపారు. నిర్మాతలు తాను కట్టేసిన తర్వాతనే హోటల్ బిల్స్ డబ్బులు పంపించారని.. తన వసతికి సంబంధించిన బిల్స్ నే లాండ్రీ బిల్స్ గా చెబుతున్నారని మెహ్రీన్ అంటున్నారు. నిర్మాతలు తనతోనే కాకుండా చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరితోనూ ఇలాగే ప్రవర్తించారని మెహ్రీన్ అంటున్నారు. డైరెక్టర్ ను కూడా పలుమార్లు అవమానించారని మెహ్రీన్ చెప్పుకొచ్చారు.