దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా రూపొందుతున్న ‘తలైవి’ చిత్రంలో శశికళ పాత్రను ప్రియమణి పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. అవేవీ కాదని తెలుస్తోంది. పూర్ణ శశికళ పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి మొదట శశికళ పాత్రను పోషిస్తుందని తాము భావించామని..కానీ డేట్స్ కుదరకపోవడంతో ప్రియమణి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని దర్శకుడు విజయ్ తెలిపారు. ఆ తర్వాత తాము పూర్ణను సంప్రదించగా ఆమె అందుకు ఓకే చెప్పిందని..పూర్ణ అద్భుతమైన నటి అని ఆమె తమ సినిమాలో భాగస్వామి కావడం తమకు ఆనందంగా ఉందని విజయ్ తెలిపారు. పూర్ణకు మేకప్ టెస్ట్ కూడా తాము చేశామని..అద్భుతంగా కుదిరిందని విజయ్ చెప్పారు.

ఇక రోజా ఫేమ్ ‘మధు'(మధుబాల) కూడా సినిమాలో కీలక పాత్రను పోషించనుంది. ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి పాత్రలో కనిపించనుంది. మొదట మధుబాలను జయలలిత తల్లి క్యారెక్టర్ సంధ్య పాత్ర కోసం అడగాలని భావించానని.. ఎప్పుడైతే ఆమెను కలవడం జరిగిందో ఆమె జానకి పాత్రకు తప్పకుండా సరిపోతారని తాను భావించానని విజయ్ తెలిపారు. పూర్ణ, మధు ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారని అన్నారు. ఏ సినిమాకైనా క్యాస్టింగ్ అన్నది చాలా ముఖ్యమని..బయోపిక్ ల కైతే అది మరీ ముఖ్యమని విజయ్ చెప్పుకొచ్చారు. తమ సినిమాలో అద్భుతమైన నటులు నటిస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉందని.. ప్రస్తుతం చెన్నైలో సినిమా షూటింగ్ జరుగుతోందని..మార్చి వరకూ షూటింగ్ కొనసాగుతుందని విజయ్ అన్నారు.

సీఎం జయలలిత జయంతి సందర్భంగా తలైవి సెకండ్ లుక్ ను విడుదల చేశారు. కంగనా రనౌత్ అచ్చం జయలలితలా ఆ ఫొటోలో ఉంది. తెలుపు చీర, నుదుటిన బొట్టుతో ఒకప్పటి జయలలిత లాగే అచ్చుగుద్దినట్లు కంగనా ఉండడం విశేషం. ఈ సినిమా కోసం కంగనా ఎంతగానో కష్టపడుతోందని దర్శకుడు విజయ్ చెప్పారు. అచ్చం జయలలిత లాగే కనిపించడానికి కంగనా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తోందని.. అమ్మ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సమయంలో ఎలా ఉండేదో అచ్చం అలాగే కనిపించడానికి కంగనా బరువు పెరగాలని నిర్ణయించుకుందని విజయ్ చెప్పారు. ప్రతి ఒక్కటి పక్ ఫెక్ట్ గా కుదిరేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు విజయ్.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.