మెగాస్టార్ కొత్త లుక్‌ వెనక సీక్రెట్ ఇదే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2020 8:17 AM GMT
మెగాస్టార్ కొత్త లుక్‌ వెనక సీక్రెట్ ఇదే

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల సరికొత్త లుక్‌తో తన అభిమానులను ఆశ్చర్య పరిచారు. గుండు బాస్‌గా కనపడి అందరికి షాక్‌ ఇచ్చారు. ఈ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా నల్ల కళ్లద్దాలతో కనిపించారు. దీనికి అర్భన్‌ మాంక్‌ లుక్‌ అనే పేరుపెట్టారు. ఈ లుక్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఆయన గుండు వెనుక ఉన్న రహస్యాన్ని చేధించే క్రమంలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. నిజంగా చిరు గుండు చేయించుకున్నారా..? లేక కొత సినిమా కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నారా..? అన్న సందేహాలు కలిగాయి.

తాజాగా చిరంజీవి తన లుక్‌ వెనుకున్న సీక్రెట్‌ను రివీల్‌ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు అర్భన్‌ మాంక్‌ లుక్‌లోకి తాను ఎలా మారాననే విషయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. "నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మ్యాజిక్ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌" అని చిరు తెలిపారు. మీరు కూడా ఒకసారి చిరు ‘అర్బన్‌ మాంక్‌’ మేకింగ్‌ వీడియోని చూసేయండి.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంతో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. కొవిడ్‌ పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆచార్య చిత్రం తరువాత మెగాస్టార్‌ 'లూసిఫర్‌', 'వేదాళం' రీమేక్‌లలో నటించనున్నారు.

Next Story