మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం రానుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విష‌య‌మై మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్పంధించారు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని కొట్టిపారేశారు. మెగా అభిమానుల‌ను గందరగోళానికి గురిచేసేందుకే కొంతమంది కావాల‌ని లేనిపోని వార్త‌లు వండివారుస్తున్నార‌ని నాగ‌బాబు అన్నారు.

ప్రస్తుతం అన్న‌య్య‌కు జనసేన పార్టీతో త‌ప్ప వేరే దేనితో సంబంధం లేదని.. త‌మ్ముడు కల్యాణ్‌ ఆలోచనలను అన్నయ్యగా సమర్థిస్తారన్నారు. ఈ విష‌య‌మై నాగబాబు త‌న యూట్యూబ్‌ ఛానల్ ద్వారా మాట్లాడారు. అన్న‌య్య‌ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేయాలనుకున్నార‌ని.. అందుకే రాజకీయాలను వదిలి సినిమాలపై దృష్టి పెట్టారన్నారు.

చిరూ సినిమాపై స్పందిస్తూ.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని, ఈ ఏడాది చివరి నాటికి మరో సినిమా ప్రారంభం కానుందని అన్నారు. అన్న‌య్య‌ ఏ పార్టీలోకి వెళ్లినా ఘ‌న‌ స్వాగతం లభిస్తుందని.. రాజ్యసభ సభ్యత్వం ఆయ‌న‌కు అవ‌స‌రం లేదన్నారు.

తమ్ముడు పవన్‌ కోసం.. అన్నదమ్ములిద్దరం ఒకే రంగంలో ఎందుకనే ఉద్దేశంతోనే అన్న‌య్య‌ రాజకీయాలకు దూరంగా ఉన్నార‌ని నాగబాబు అన్నారు. పవన్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కొర‌కే అన్న‌య్య త్యాగం చేశార‌ని అన్నారు. అన్న‌య్య‌కు అన్ని పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయ‌ని.. అలాగ‌ని ఆయా పార్టీల నిర్ణయాలకు వంతపాడటం లేదన్నారు. తాజాగా కొంతమంది చిరంజీవి ఇంటిముందు ధర్నా చేయాలనే వార్తలు కూడా వచ్చాయని.. ఇది చాలా తప్పుడు నిర్ణయమన్నారు. చిరంజీవిపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.