అప్‌డేట్స్: తాత, తల్లి కళ్ల ముందే బోరుబావిలో పడ్డ బాలుడు
By సుభాష్ Published on 27 May 2020 3:12 PM GMTమెదక్ జిల్లా పాపన్నపేట పోడ్చన్‌పల్లిలో విషాదం నెలకొంది. తాత, తల్లి కళ్ల ముందే సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయారు. కాగా, బోరు తవ్వి నీళ్ల పడకపోవడంతో వదిలేసిన కొద్దిసేపటికే బాలుడు పడిపోవడంతో విషాదంగా మారింది. బాలుడి తండ్రి పంట పొలం కోసం బోరుబావిని 120 నుంచి150 అడుగుల లోతు వరకూ తవ్వినా నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేశారు. కాగా, ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ బోరుబావిలో పడిన చిన్నారులు బతికి బయటపడ్డ దాఖలాలు లేవు. ఘటన స్థలానికి రెండు 108 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. అలాగే ఘటన స్థలానికి రెండు ప్రొక్లెయినర్లు వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నాయి. బావికి సమాంతరంగా తవ్వుతున్నారు.
ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఆక్సిజన్‌ను బావిలోకి పంపించారు. బాలున్ని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కళ్లముందే బాలుడు పడిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైన కొడుకును కాపాడాలని దేవున్ని, అధికారులను వేడుకుంటూ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. వ్యవసాయం కోసం ఇప్పటికే రెండు బోర్లు తవ్వించినా నీళ్లు పడలేదని తెలుస్తోంది. తల్లితో పాటు బాలుడు వెళ్తుండగా, బాలుడు బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. కాగా, వారికి ముగ్గురు కొడుకులు కాగా, బావిలో పడిన బాలుడు మూడో కుమారుడుగా తెలుస్తోంది.