మక్కా సందర్శనపై తాత్కాలిక నిషేధం
By న్యూస్‌మీటర్ తెలుగు
సౌదీ అరేబియాలోని మక్కా మసీదు సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధం విధిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
మక్కాను సందర్శించేందుకు ఇప్పటికే.. తమ దేశం చేరుకున్న విదేశీయులను తగిన వైద్య పరీక్షల అనంతరం మక్కా సందర్శనకు అనుమతిస్తామని తెలిపింది. ఇక ముందు, ముఖ్యంగా కోవిడ్ వైరస్ విస్తరించిన దేశాలకు చెందిన యాత్రికులను ఎంత మాత్రం తమ దేశంలోకి అనుమతించమని సదరు ప్రకటనలో సౌదీ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ప్రతి ఏడాది జరిగే హజ్ యాత్ర సందర్భంగా జూలై నెలలో ప్రపంచంలోని పలు దేశాల నుంచి ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు పవిత్రమైన ప్రధాన ఇస్లాం మత క్షేత్రాల్లో మక్కాను ఒకటిగా భావిస్తారు. అందుకే ఒక్క జూలై నెలలోనే దాదాపు 30 లక్షల మంది మక్కాను సందర్శిస్తారు.