కార్పొరేషన్‌ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తా

By అంజి  Published on  30 Jan 2020 6:26 AM GMT
కార్పొరేషన్‌ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తా

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ యాదగిరి సునీల్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్‌ కార్యాలయంలో కొత్త పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కాగా డిప్యూటీ మేయర్‌గా 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ చల్ల స్వరూపారాణి ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన 59 మంది కార్పొరేటర్లతో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరంర కరీంగనర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ తనకు కుమారుడి వివాహం కారణంగా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కరీంనగర్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 33 డివిజన్లను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ముగ్గురు ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం మరింత పెరిగింది.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. మహిళలకు సముచిత స్థానాలను కల్పిస్తున్నామని.. అందుకే డిప్యూటీ మేయర్‌గా బీసీ మహిళ చల్ల స్వరూపరాణికి అవకాశాం ఇచ్చామన్నారు. ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలని మంత్రి గంగుల పాలవర్గానికి సూచించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

మేయర్‌ సునీల్‌ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్‌ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.

Next Story