అరుదైన రికార్డు ముంగిట మయాంక్‌..

By Newsmeter.Network
Published on : 28 Feb 2020 3:52 PM IST

అరుదైన రికార్డు ముంగిట మయాంక్‌..

భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. శనివారం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ టెస్టులో మయాంక్‌ మరో 36 పరుగులు చేస్తే.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిని నిలవనున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో మయాంక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 35, రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున ఆ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 10 టెస్టులాడిన మయాంక్‌.. 15 ఇన్నింగ్స్‌ల్లో 964 పరుగులు చేశాడు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు వినోద్‌ కాంబ్లీ పేరున ఉంది. కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. వినోద్‌ కాంబ్లీ తరువాత.. చతేశ్వర్ పుజారా (18 ఇన్నింగ్స్‌లు), సునీల్ గవాస్కర్ (21), మంజ్రేకర్ (23), రాహుల్ ద్రవిడ్ (23), సౌరవ్ గంగూలీ (23) టాప్-6లో కొనసాగుతున్నారు.

ఒకవేళ తొలి ఇన్నింగ్స్‌లో ఈ వెయ్యి పరుగుల మార్క్‌ని అందుకుంటే 16 ఇన్నింగ్స్‌లతో పుజారాని వెనక్కి నెట్టి రెండో స్థానానికి మయాంక్ అగర్వాల్ ఎగబాకనున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అందుకున్నా.. 17 ఇన్నింగ్స్‌లతోనూ రెండో స్థానంలో నిలవనున్నాడు. గత ఏడాది నుంచి టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్ 64.27 సగటుతో పరుగులు చేస్తున్నాడు.

Next Story