ఉద్రిక్తంగా కొనసాగుతున్న పీవోకే స్వాతంత్య్ర పోరాటం!

By సత్య ప్రియ  Published on  24 Oct 2019 7:05 AM GMT
ఉద్రిక్తంగా కొనసాగుతున్న పీవోకే స్వాతంత్య్ర పోరాటం!

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడికిపోతోంది. స్వాతంత్య్రోద్యమ కాంక్షతో రగిలిపోతోంది. స్వతంత్రం ఇవ్వాలంటూ.. పీఓకే వాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇంతకాలం మోస్తరు ఆందోళనలతోనే సరిపెట్టిన పీవోకే ప్రజలు, ఇప్పుడు స్వాతంత్య్ర పోరాటం చేపట్టారు. పాకిస్థాన్ పెత్తనం నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ.. ఉద్యమబాట పట్టారు.

ముజఫరాబాద్ కేంద్రంగా స్వాతంత్య్ర పోరాటం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్కడ అంటుకున్న స్వతంత్రోద్యమ సెగలు పీఓకే అంతటికీ విస్తరిస్తున్నాయి. తాజాగా ముజఫరాబాద్‌లో భారీ ర్యాలీ జరిగింది. వేలాదిమంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

అయితే ప్రజా ఉద్యమంతో పాకిస్థాన్ బిత్తరపోయింది. ప్రజా పోరాటాన్ని అణిచివేయడానికి భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆందోళనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కాల్పులు కూడా జరిపారు.

లాఠీఛార్జ్ చేసినా.. భాష్పవాయు గోళాలు ప్రయోగించినా.. చివరికి కాల్పులు జరిపినా పీఓకే వాసులు వెనక్కి తగ్గడం లేదు. పైగా రెట్టించిన పట్టుదలతో మళ్లీ మళ్లీ పోరాటం చేస్తున్నారు.

ప్రజా పోరాటానికి మీడియా కూడా తోడైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు. దీనిలో భాగంగా ముజఫరాబాద్‌లో పాత్రికేయులు నిరసన తెలిపారు. ప్రెస్‌క్లబ్ ఎదుట బైఠాయించి పాక్ భద్రత బలగాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ ప్రభుత్వ పెత్తనం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు.

Next Story