ఆరు రోజుల్లో రెండున్నర లక్షల మాస్కులు.?

By అంజి  Published on  19 Feb 2020 3:09 AM GMT
ఆరు రోజుల్లో రెండున్నర లక్షల మాస్కులు.?

కోవిడ్- 19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో శ్రామిక శక్తికి పేరుపొందిన చైనా తన దేశ ప్రజలను రక్షించుకొనేందుకు విపరీతంగా శ్రమిస్తోంది. ఇటీవల పదంటే పది రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించిన చైనా ఇప్పుడు కేవలం ఆరు రోజుల వ్యవధిలో బీజింగ్ ఓ ఫ్యాక్టరీని నిర్మించాలని నిశ్చయించింది. రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూ ఉండటం, చాలినన్ని మాస్కులను సరఫరా చేయలేకపోతూ ఉండటంతో, రోజుకు 2.50 లక్షల మాస్క్ లను తయారు చేసేలా ఈ ఫ్యాక్టరీని నిర్మించాలని కంకణం కట్టుకుంది.

Mask manufacturing in China

సోమవారం నాడే ఫ్యాక్టరీ నిర్మాణం పనులు ప్రారంభం కాగా, ఆదివారం నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి, ఆ వెంటనే ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చైనా అధికారులు తెలిపారు. షిఫ్ట్ ల వారీగా ఇక్కడ 24 గంటలూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం పదే పది రోజుల్లోనే 1000 పడకల సామర్థ్యమున్న భారీ ఆసుపత్రిని నిర్మించడం ఓ రికార్డ్ అని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచురించాయి. ఇప్పుడు ఈ నిర్మాణంతో చైనా మరోసారి రికార్డులకు ఎక్కుతోంది.

ఇదిలా ఉంటే.. రోజురోజుకూ ఈ వైరస్‌తో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ 1800 మంది ఈ వైరస్ భారీన పడి మృతి చెందడం జరిగింది. కాగా సోమవారం నాడు ఒక్కరోజే 105 మంది మృతి చెందారని వైద్య వర్గాలు మీడియాకు తెలిపాయి.

కోవిడ్ -19 కు ప్రధాన కేంద్రంగా ఉన్న వుహాన్‌ నగరానికి మరో 30 వేల మంది వైద్య సిబ్బందిని పంపించాలని నిర్ణయించారు. హుబెయ్‌ లో ప్రజల కదలికలపై మరిన్ని ఆంక్షలు విధించారు.

Mask manufacturing in China

ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కోవిడ్-19 వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో చైనాను అల్లాడించిన సార్స్, సౌదీని వణికించిన మెర్స్ వైరస్‌లతో పోల్చుకుంటే కోవిడ్ అంత ప్రమాదకరమైంది కాదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలకు కోవిడ్‌పై దాదాపు ఓ అవగాహన వచ్చేసినట్లే. అదీగాక ఈ వైరస్ సోకిన 80శాతం రోగుల్లో వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా ఏమీ లేవన్నారు.

Next Story