కూతురు అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసు నిందితుడుగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య కలకలం సృష్టించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌ చింతలగూడ బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో నిద్రించిన మారుతీరావు.. ఆదివారం ఉదయం చూసేసరికి విషంతాగి ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా..? లేక సాధారణ మరణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వేధింపుల వల్లే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.

విషం తాగడం వల్లనే..

ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు పోస్టుమార్టం పూర్తి అయ్యింది. మారుతీరావు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఘటన గురించి తెలిసిన తరువాత ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్‌ టీంతో తనిఖీలు చేయించామన్నారు. ఆ సమయంలో మారుతీరావు విగతజీవిగా పడి ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలంలో దొరికిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామని.. ఆ లేఖలో గిరిజా క్షమించు అమృతా అమ్మదగ్గరికి రా అని ఉందని సీఐ తెలిపారు. పోస్టుమార్టం పూర్తి అయిన నేపధ్యంలో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మారుతీరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మిర్యాలగూడకు తరలించారు.

అనుమానాలు ఎన్నో..

మారుతీ రావు విషం తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అనుకుంటే సంఘటనా స్థలంలో పాయిజన్‌ బాటిల్‌ గాని, పురుగుల మందు డబ్బా గాని లబించలేదు. ప్రధానంగా శనియం సాయంత్రం 6.50 నుంచి రాత్రి 9గంటల మధ్య ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 6.50కు వచ్చిన మారుతీరావు కొద్ది సేపటి తరువాత బయటకు వెళ్లి వచ్చాడు. ఎవరెవరిని కలిసాడు అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. డ్రైవర్‌ చేత గారెలు తెప్పించుకుని తిన్నాడు. డ్రైవర్‌ రూంలోంచి బయటకు రాగానే గడియా పెట్టుకున్నాడు. గదిలో సూసైడ్‌ నోట్‌ తప్ప మరే ఆధారం దొరకలేదు. గదిలో పాటు వాష్‌ రూం, బాత్రూంలో వాంతి చేసుకున్నట్లుగా ఉంది. ఉదయాన్నే అడ్వకేట్‌ దగ్గరికి వెళ్లాలి అని చెప్పిన మారుతి సడెన్‌గా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు మారుతీరావు కాల్‌డేటా ఆధారంగా ముందుకు వెలుతున్నారు.

షెడ్డులో దొరికిన శవం..

ఇదిలాఉంటే గత వారంరోజుల క్రితం మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో ఓ కుళ్లిన శవం కనిపించింది. షెడ్డునుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఒంటిపై బ్లూ కలర్‌ షర్ట్, జీన్స్‌ ప్యాంట్‌, చేతికి వాచ్‌ ఉన్నాయి. ముఖం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మారుతీరావు షెడ్డులో ఈ ఘటన జరగడంతో మారుతీరావే హత్య చేయించాడా..? ఇంకా ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మారుతీరావు ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రణయ్‌ కుమార్‌ దారుణ హత్య..

మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృత. వీరిది ఉన్నత కుటుంబం. మారుతీరావు కుమార్తె అమృత అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమవివాహం చేసుకుంది. ప్రయణ్‌, అమృత కులాలు వేరువేరు కావటంతో మరుతీరావు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అమృత ప్రయణ్‌ను పెళ్లిచేసుకుని తన ఇంటినుంచి ప్రణయ్‌ ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మారుతీరావు ప్రణయ్‌పై కక్షపెంచుకున్నాడు. పలుమార్లు అమృతను ప్రణయ్‌ను వదిలి ఇంటికిరావాలని రాయబారాలు నడిపారు. దీంతో తన తండ్రి మారుతీరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో పెరుమాళ్‌ ప్రణయ్‌ కుమార్‌ దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అమృతతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. హత్యకు సంబంధించి మారుతీరావు సహా ఎనిమిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మారుతీరావు వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఏడు నెలలు ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జైలు నుంచి బెయిల్‌పై విడుదలై వచ్చాయి.

మారుతీరావు జైలు నుంచి వచ్చిన తరువాత కూడా కూతురిని తన వద్దకు రావాలని పలువురితో రాయబారాలు పంపించినట్లు, అమృత ససేమీరా అన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అదే సమయంలో అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి ప్రయణ్‌ అని పేరు పెట్టారు. కూతురు ఎంత చెప్పినా తన ఇంటికి రావటంతో మారుతీరావు బంధువుల వద్ద చెప్పి తీవ్ర మనోవేదనకు గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.