2010 లో 75 మందిని దంతేవాడ లో హత్య చేసి, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్ల సహా పదకొండు మంది కాంగ్రెస్ సీనియర్ నేతలను 2012 లో పొట్టన బెట్టుకున్న నక్సల్ అగ్రనేత రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయినట్టు తెలియవస్తోంది. సిద్ధిపేటలో పుట్టినా మూడు దశాబ్దాలకు పైగా బస్తర్ లో మావోయిస్టు కార్యకలాపాలకు సారథ్యం వహిస్తూ, కీలక నేతగా ఎదిగిన రామన్న కు గుండెపోటు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలియవస్తోంది. ఈ గుండెపోటు కారణంగానే ఆయన చనిపోయాడని తెలుస్తోంది.

ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని బిజాపూర్ జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలోని పామేడు సమీపంలో ఒక కీలక నక్సల్ నేత అంత్యక్రియలు జరిగాయని, దానికి వందల సంఖ్యలో నక్సల్స్ హాజరయ్యారని వార్తలు వచ్చిన నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి రామన్నే అని ఛత్తీస్ గఢ్ పోలీసులు భావిస్తున్నారు. రామన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర , తెలంగాణ లలో అతనిపై వివిధ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అతని తలపై పోలీసులు వెల కట్టారు. ఈ మొత్తం రూ. 1.37 కోట్లు ఉంటుందని అంచనా. మావోయిస్టు వ్యూహకర్తగా, ఆపరేషన్స్ నిపుణుడిగా రామన్నకి పేరుంది. దంతేవాడ, ఝీర్ గ్రామ్ ఘాటీ హత్యాకాండతో పాటు 2017 లో బుర్కాపాల్ దాడి ఘటనకు కూడా రామన్న సూత్రధారి. ఈ సంఘటనలో 25 మంది సీఆర్ పీ ఎఫ్ జవాన్లు అసువులు బాశారు.

రామన్న చనిపోయినట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని తరువాత తేలింది. కానీ ఈ సారి ఆయన చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రామన్న చాలా కాలంగా డయాబెటిస్ పేషంట్ అని పోలీసులు చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.