► నిర్మాణ పనులకు సహకరిస్తున్నారంటూ మావోల ఘాతుకం

► మావోయిస్టులపై గ్రామస్తుల ఎదురు దాడి

► ఒక మావోయిస్టు మృతి, ఒకరికి గాయాలు

► గ్రామానికి ప్రత్యేక పోలీసు బలగాలు

ఏవోబీలో మావోయిస్టులు, గ్రామస్తుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా జోడంభో గ్రామంపై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. పది మంది గిరిజనుల ఇళ్లతో పాటు వారి బైక్‌లను మావోయిస్టులు దగ్ధం చేశారు. రహదారి ఏర్పాటుకు సహకరిస్తున్నారంటూ, అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవ్వరు కూడా పాల్గొన వద్దంటూ మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో జంతురై గ్రామస్తులు మావోయిస్టులపై తిరగబడి దాడికి దిగారు. మావోలపై బాణాలతో, రాళ్లతో దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో హడ్మా అనే మావోయిస్టు మృతి చెందగా, జిప్రో అనే మరో మావోయిస్టుకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం తెలుసుకున్న ఒడిశా పోలీసులు గ్రామానికి చేరుకుని గాయపడ్డ మావోయిస్టును అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, హత్యకు గురైన మావోయిస్టును గుమ్మ ఏరియా కమిటీ సభ్యురాలు పద్మగా గుర్తించగా, అలాగే అరెస్టు అయిన వ్యక్తి నందపూర్‌ ఏరియా కమిటీ కమాండర్‌ అని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల నియామ్‌గిరి కొండల సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తుండగా మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే జనవరి 22న నియామ్‌గిరి ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు అడ్డుకుని పనులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులకు గ్రామస్తులు సహకరిస్తున్నాంటూ జోడంభో గ్రామంపై మావోయిస్టులు ఈ దాడికి పాల్పడగా, అందుకు ప్రతీకారంగా గ్రామస్తులు ఎదురు తిరిగి వారిపై దాడి చేశారు.

గ్రామస్తుల ఎదురు దాడి

మావోయిస్టులపై గ్రామస్తులు ఎదురు దాడికి దిగి ఒక మావోయిస్టును చంపేయడం ఇదే మొదటిసారి అని మల్కన్‌గిరి పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మావోలు తిరిగి గ్రామస్తులపై దిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా భద్రతా సిబ్బందిని గ్రామానికి తరలించినట్లు గ్రామస్తులకు ఎలాంటి హాని జరుగకుండా రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసులకు తలనొప్పిగా మారిన మావోయిస్టులు

ఏపీ సరిహద్దులో ఉన్న స్వాభిమాన్‌ ఆంచాల ప్రాంతం రెండు దశాబ్దాలుగా మావోయిస్టులకు అడ్డాగా మారింది.  ఆంధ్ర – ఒడిశా సరిహద్దులో స్పెషల్‌ జోనల్‌ కమిటీ మావోయిస్టుల కమాండర్లు ఉండటం ఒడిశా రాష్ట్ర పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్‌ సదుపాయలు, అభివృద్ధి లేకపోవడంతో పూర్తిగా వెనుకబడి ఉంది. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో 9 మేజర్‌ గ్రామ పంచాయతీలు, 151 గ్రామాలు ఈ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉండి.. వారి కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. అందుకే పలు మార్లు ఈ ప్రాంతంలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.