తెలంగాణలో 'అన్నల' కదలికలు.. అటవీ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్‌

By సుభాష్  Published on  11 March 2020 12:24 PM GMT
తెలంగాణలో అన్నల కదలికలు.. అటవీ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్‌

గత కొంత కాలంగా తెలంగాణలో మావోయిస్టుల కదలికలు తగ్గుముఖం పట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు శాఖ మావోయిస్టుల జాడలు లేకుండా చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టులు కనుమరుగయ్యారనే చెప్పాలి. మావోయిస్టులకు అడ్డగా మారిన సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రంలోకి రాకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు మళ్లీ అడుగుపెట్టారన్నవార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోలు రాష్ట్రంలో అడుగుపెట్టారన్న పక్కా సమాచారంతో పోలీసులు అటవీ కూంబింగ్‌ నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో మావోల కదలికలు ఏర్పడటంతో పోలీసులకు తలనొప్పిగా మారిందనే వార్తలు వినవస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి నాలుగు మావోయిస్టుల బృందాలు తెలంగాణలోని భద్రాదికొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మణుగూరు, ఏడూళ్ల బయ్యారం, గుండాల, కరకగూడెం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా, నీలాద్రిపేట గుట్ట వద్ద మావోయిస్టులు కంటపడినట్లు భద్రాది కొత్తగూడెం జిల్లా పోలీసులు తెలిపారు. పోలీసులను చూసి మావోయిస్టులు ఇక్కడున్న వారి వస్తువులను వదిలేసి పరారైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మావోయిస్టులకు సంబంధించిన ఐఈడీఎస్‌, కిట్‌ బ్యాగులు, పెన్‌ డ్రైవ్‌లు, సోలార్‌ పానెల్‌, విప్లవ సాహిత్య పుస్తకాలు, ప్లాస్టిక్‌ షీట్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పారిపోయిన మావోస్టుల కోసం గాలింపు చర్యలు

కాగా, మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, పోలీసులను చూసి పారిపోయిన ఏడుగురు మావోయిస్టుల కోసం పలు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపు అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.

Next Story