ఆ క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు.. పెళ్లి చేసుకుంది ఓ హీరోయిన్‌ను మరి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Dec 2019 6:01 PM ISTటీమిండియా క్రికెటర్ మనీష్ పాండే ఓ ఇంటివాడయ్యాడు. తమిళ హీరోయిన్ అశ్రిత శెట్టిని మనీష్ పాండే నేడు వివాహమాడాడు. వీరి వివాహం ముంబాయిలోని ఓ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తిగా వారి సంప్రదాయంలో జరిగిన మనీష్-అశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.
అయితే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోను మనీష్ పాండే ప్రాతినిథ్యం వహించే ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. మనీష్-అశ్రితలకు అంతా మంచే జరగాలంటూ సన్‌రైజర్స్ పేర్కొంది.
ఇదిలావుంటే.. మనీష్ పాండే నేతృత్వంలోని కర్ణాటక జట్టు తాజాగా.. సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు ఒక్క పరుగు తేడాతో తమిళనాడుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. మనీశ్ పాండే (45 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్సుతో రాణించాడు.
ఇక మనీష్ వివాహమాడిన అశ్రిత(26)ది ముంబయి. 2012లో ‘తెళికెద బొల్లి’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అనంతరం సిద్దార్ద్ హీరోగా నటించిన ఎన్‌హెచ్ -4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తరువాత ‘ఒరు కన్నియమ్ మూను కలవానికుళుమ్’, ‘ఇంద్రజిత్’ సినిమాల్లోనూ నటించింది.