చిన్నింటి దగ్గర మూడు రోజులు.. పెద్దింటి దగ్గర మూడు రోజులు.. ఆ ఒక్క రోజు మాత్రం..!

By సుభాష్  Published on  22 Jan 2020 8:39 AM GMT
చిన్నింటి దగ్గర మూడు రోజులు.. పెద్దింటి దగ్గర మూడు రోజులు.. ఆ ఒక్క రోజు మాత్రం..!

ఇది ఓ భర్త.. ఇద్దరు భార్యల కథ. జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీకి చెందిన రాజేష్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల్లో ఓ సమస్య వచ్చిపడింది. రాజేష్‌ ఒక భార్యతో కొన్ని రోజులు, మరో భార్యతో మరి కొన్ని రోజులు గడుపుతున్నాడు. రాజేష్‌ ఇలా కొన్ని కొన్ని రోజులు గడపడం మొదటి భార్యకు నచ్చలేదు. తన భర్త రెండో భార్య వద్దనే ఎక్కువ రోజులు గడుపుతున్నాడని, తన వద్దకు రావడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు భర్తను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించేశారు. తర్వాత రాజేష్‌ కథ మరోలా మారింది. రాజేష్‌ రెండో భార్య వద్దకు వెళ్లకుండా మొదటి భార్య వద్దే ఉండటం మొదలు పెట్టాడు. తర్వాత రెండో భార్యకు కూడా కొపమొచ్చి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వల్ల తనకు అన్యాయం జరుగుతుందని స్టేషన్‌కు వెళ్లి నానా హంగామా చేసింది.

ఇక రాజేష్‌ను మళ్లీ స్టేషన్‌కు రప్పించడం పోలీసుల వంతైంది. స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు భార్యలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇద్దరు భార్యలు రాజేష్‌ను నావద్ద ఉండాలంటే.. నావద్ద ఉండాలంటూ పోలీసుల ముందే గొడవకు దిగారు. ఈ తతంగంతో తలబొప్పి కట్టిన పోలీసులు వీరి సమస్యను సీరియస్‌గా తీసుకున్నారు. ముగ్గురిని స్టేషన్‌లో కూర్చోబెట్టి ఒక అభిప్రాయానికి రావాలని పోలీసులు సూచించారు. భర్త, ఇద్దరు భార్యలు చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు.

వారంలో మూడు రోజుల పాటు మొదటి భార్య దగ్గర (సోమవారం నుంచి బుధవారం వరకు), మరో మూడు రోజులు రెండో భార్య దగ్గర ( గురువారం నుంచి శనివారం వరకు) ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే భర్తకు ఆదివారం మాత్రం వీక్లీ ఆఫ్‌ ఇచ్చారు. ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వారి దగ్గర ఉండొచ్చని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఇప్పుడైనా వీరి సమస్యకు ఎండ్‌ కార్డ్‌ పడుతుందా.? లేక మళ్లీ పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కుతారా..? అనేది వేచి చూడాల్సిందే.

Next Story