బీరులో బల్లి.. నోట్లో పెట్టుకుని

By Newsmeter.Network  Published on  18 Feb 2020 3:10 PM IST
బీరులో బల్లి.. నోట్లో పెట్టుకుని

ఇంట్లో గోడలపై బల్లులు పాకుతుంటేనే చూసి భయపడేవాళ్లు కొందరుంటారు. పొరబాటున అదే పైన పడితే దోషమని మూఢ నమ్మకాలు అంటూ.. ఉండేవాళ్లకు కొదవే ఉండదు. ఒళ్లంతా విషాన్ని నింపుకున్న బల్లి.. తినే పదార్థాల్లో పడిందనే తెలియగానే వెంటనే వాటిని పడేస్తాం. ఆ ఆహారంలో చనిపోయిన బల్లి కనిపిస్తే.. వెంటనే దాన్ని పడేస్తాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బల్లిని పట్టుకుని సీపీఆర్ చేసి.. దాని నోట్లో నోరు పెట్టి.. గాలి ఊది ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌లో జరిగింది.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో గల కోడిండీ బీచ్‌లో గల ఓ బార్‌లో ఓ వ్యక్తి బీరు తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయన బీర్‌ జగ్గులో బల్లి పడింది. తన ఫ్రెండ్స్‌ తనను ఆటపట్టించడానికి రబ్బరు బల్లిని వేశారని మొదట భావించినా.. అది గిలగిలా కొట్టుకోవడంతో.. దాన్ని బయటకు తీశాడు. తన వేలుతో దాని గుండెలపై నొక్కుతూ సీపీఆర్ చేశాడు. అప్పటికీ స్పందించకపోవడంతో దాని నోటిలో నోరు పెట్టి గాలి ఊదాడు.

అంతే.. చనిపోయిందనుకున్న ఆ బల్లి మళ్లీ బతికేసింది. దీంతో ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఆ బల్లి ఆటుఇటు వెళ్లకుండా.. ఆ వ్యక్తి చేతులపైనే కదులుతూ ఆడుకో సాగింది. అది ఆయనకి మంచి ఫ్రెండ్‌లా మచ్చిక కావడంతో దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Next Story