మానవత్వం మంటగలిసిన వేళ..నడిరోడ్డుపైనే మృతి
By రాణి Published on 26 March 2020 11:08 AM IST
- సాయం చేసేందుకు ముందుకురాని చేతులు
- గుండెపోటుతో విలవిల్లాడుతున్నా పట్టించుకోని దైన్యం
కరోనా వైరస్..దీని కారణంగా మానవ సంబంధాలు దాదాపు తెగిపోయాయి. ప్రభుత్వాలు లాక్ డౌన్ లు ప్రకటించడంతో ఎవరికి వారు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు మినహా మిగతా ఎలాంటి ఆపరేషన్లు పెట్టుకోవద్దని ప్రభుత్వం ఆస్పత్రి వర్గాలకు ఆదేశాలిచ్చింది. ఇందులో గర్భిణులకు మాత్రం మినహాయింపు ఉంది.
Also Read : కష్టకాలంలో కనికరించని పోలీసులు
అయితే ఇప్పుడు ఆ కరోనా భయమే ఓ వ్యక్తి నడిరోడ్డుపై మృతి చెందడానికి కారణమైంది. ఉగాది పండుగరోజు కరీంనగర్ లో జరిగిన ఈ సంఘటన ఇపుడు సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముస్తాబాద్‌కు చెందిన కె.వెంకటేష్(55) కరీంనగర్‌లో ఉంటూ ఓ స్టీల్ దుకాణంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం ఉగాది పండుగ సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇంటి నుంచి రైతుబజార్‌కు నడిచి వెళ్తూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో రోడ్డుపై పడిపోయారు. 10 నిమిషాల పాటు విలవిల్లాడుతున్నా చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉన్నారు తప్ప కనీసం అంబులెన్స్ కు కూడా ఫోన్ చేయలేదు. కాసేపటికి అక్కడికొచ్చిన పోలీసులు వెంకటేష్ ను ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు. గుండెపోటుతోనే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మాస్క్ ధరించి ఉండటంతో కరోనా వచ్చిందేమోనన్న సందేహంతోనే స్థానికులెవరూ అతని వద్దకు వెళ్లలేదని తెలుస్తోంది.
Also Read : కరోనా వేళ ఖాకీ జులుం..వేల లీటర్ల పాలు, కూరగాయలు చెత్తకుప్పల్లోకి..
ఇక్కడ మరింత విషాదమైన విషయం ఏమిటంటే..ఆ కుటుంబానికి కనీసం అంత్యక్రియలు నిర్వహించే స్తోమత కూడా లేకపోవడం. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు మేయర్ సునీల్ రావు ఆర్థిక సహాయం చేశారు. వెంకటేష్‌కు భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు పూర్తిచేయగా, రెండో కుమార్తె ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వెంకటేష్‌కు గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది.