విమానాశ్రయంలో బాంబు పెట్టింది నేనే..

By సుభాష్  Published on  23 Jan 2020 11:40 AM GMT
విమానాశ్రయంలో బాంబు పెట్టింది నేనే..

ముఖ్యాంశాలు

  • డీఐజీ ముందు లొంగిపోయిన నిందితుడు

  • పోలీసుల విచారణలో సంచలన నిజాలు

  • నిందితుని నేర చరిత్రను చూసి షాకైన పోలీసులు

రెండు రోజుల కిందట కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు వ్యవహారం తీవ్ర కలకలం రేకెత్తింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానస్పదంగా ఉన్నబ్యాగును గమనించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాంబు స్వ్కాడ్‌తో వచ్చిన పోలీసులు బ్యాగులో పేలుడు పదార్థాలున్నట్లు గుర్తించారు. దానిని బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. ఈ ఘటనపై బాంబు పెట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోనే తేలిపోయింది. ఒక వైపు బాంబు పెట్టిన వ్యక్తి కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తుండగా, మరో వైపు బాంబు పెట్టిన నిందితుడు ఆదిత్యరావ్‌ (40) నేరుగా బెంగళూరు డీజీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు.

బాంబు పెట్టింది నేనే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు డీజీపీని కలువాలంటూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కార్యాలయానికి వెళ్లి డీజీపీని కలవాలంటూ అక్కడున్న పోలీసు సిబ్బందితో తెలుపడంతో తర్వాత రావాలని సూచించారు. దీంతో వెనక్కి వెళ్లిపోయిన నిందితుడు ఆదిత్యరావు ఐదు నిమిషాల్లోనే తిరిగి మళ్లీ వచ్చి ''నేనెవరు అనుకున్నారు..? మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టింది నేనే.. నన్నే మళ్లీ రమ్మంటారా..?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రచారం కోసమే బాంబు పెట్టానని నిందితుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. కేవలం పేరు కోసమే బాంబు పెట్టానని నిందితుడు ఆదిత్యారావు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

Man Claims He Planted Crude Bomb1

వెంటనే సీసీటీవీ పుటేజీల పరిశీలన

నిందితుడు నేనే బాంబు పెట్టానని పోలీసుల ముందు లొంగిపోవడంతో రంగంలోకి దిగిన ఇంటలిజెన్స్‌ సిబ్బంది మంగళూరు విమానాశ్రయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. తర్వాత నిందితున్ని ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి సుమారు ఆరు గంటల పాటు విచారించారు. విమానాశ్రయంలో బాంబు పెట్టింది ఆదిత్యరావు అని పోలీసులు నిర్ధారించారు. వెంటనే నిందితున్ని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, తర్వాత 1వ ఏసీఎంఎం కోర్టులో హాజరు పర్చారు. దీంతో బెంగళూరుకు చేరుకున్న మంగళూరు పోలీసులు నిందితున్ని విమానంలో మంగళూరుకు తీసుకెళ్లారు.

నిందితుని నేర చరిత్ర

నిందితుని నేర చరిత్రను తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. నిందితుడు ఆదిత్యరావుది ఉడిపి జిల్లా మణిపాల్‌. ఇంజనీరింగ్‌, ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. 2007లో బెంగళూరులోని ఓ బ్యాంక్‌లోనూ, బీమా కంపెనీలలో పని చేశారు. అయితే బీమా కంపెనీలో ల్యాప్‌ టాప్‌ చోరీ చేయడంతో పట్టుబడ్డాడు. తర్వాత ఓ బ్యాంకులో పని చేశాడు. అక్కడి సిబ్బందితో గొడవ పడి బయటకొచ్చేశాడు. తర్వాత కొన్ని రోజుల పాటు ఇంజనీరింగ్‌ కాలేజీలో సెక్యూరిటీగా పని చేశాడు. తర్వాత మంగళూరు విమానాశ్రయంలో సెక్యూరిటీ పోస్టుకోసం దరఖాస్తు చేసుకున్నా.. అది దక్కలేదు. ఇక 2018 ఆగస్టు నెలలో విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్‌ చేశాడు. దీంతో ఫోన్‌ కాల్‌ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు 2018, ఆగస్టు 29న ఆదిత్యరావు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి విచారించి, కొన్ని రోజుల తర్వాత వదిలేశారు. ఇక విమానాశ్రయంలో ఉద్యోగం రాకపోవడంతోనే బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

Man Claims He Planted Crude Bomb 2

పేరు కోసమే బాంబుల తయారీ

ఆదిత్యారావు పేరు కోసమే బాంబుల తయారీకి సిద్ధమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. యూ ట్యూబ్‌ ద్వారా పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలని తెలుసుకుని ఆన్‌లైన్‌ ద్వారా వాటిని తెప్పించుకున్నట్లు విచారణలో తేలింది. సంవత్సరం పొడవునా ఇదే ప్రక్రియ కొనసాగించి, బాంబుల తయారీ కోసం ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించినా.. చివరకు ధైర్యం చేయలేక ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

ఆదిత్యరావు కుటుంబీకులను విచారించిన పోలీసులు

ఈ నేపథ్యంలో ఆదిత్యరావు కుటుంబీకులను పోలీసులు విచారించారు. మణిపాల్‌లోని మండపల్లిలో ఉంటున్న ఆదిత్యరావు తండ్రి కృష్ణమూర్తిరావు, సోదరుడు అక్షిత్‌రావులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదిత్యరావు తమతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాల నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడని తండ్రి, సోదరులు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. అతని ప్రవర్తన సరిగ్గా లేదని, అతనికి ఎన్నిసార్లు చెప్పినా.. మార్చాలని చూసినా ఎంతకీ మారకపోవడంతో వదిలేశామని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఘటన మాకు కరెక్ట్ అనిపించలేదన్నారు. గతంలో కూడా బాంబు బెదిరింపులకు పాల్పడి జైలు పాలైతే.. తాము బెయిల్‌ కోసం ఏనాడు ప్రయత్నించలేదని తెలిపినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆదిత్యరావుతో ఎలాంటి సంబంధం లేదని తండ్రి పోలీసుల ముందు వెల్లడించారు.

Next Story