ప్రగతి భవన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
By తోట వంశీ కుమార్
సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ప్రగతి భవన్ సిబ్బంది వెంటనే అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది అతడిపై నీటిని కుమ్మరించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మలక్‌పేటలో చెప్పుల దుకాణం నడుపుతున్న ఎం.డీ నసీరుద్దీన్‌గా గుర్తించారు. లాక్ డౌన్ కారణంగా తన చెప్పుల షాప్ మూత పడడటంతో జీవనోపాథి కోల్పోయానని, అందుకే ఆత్మహత్య యత్నం చేశానని తెలిపాడు.
రెండు నెలలుగా పని లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్ కారణంగా దుకాణం మూసివేయడంతో రెండు నెలలుగా ఆదాయం లేక కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నాడు. ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు యత్నించానని, ప్రభుత్వం తన లాంటి చిరువ్యాపారులను ఆదుకోవాలని కోరారు. అతడిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.