మాల్యా ఆఖ‌రి అస్త్రం.. భార‌త్ రాకుండా ఉండేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 2:48 PM GMT
మాల్యా ఆఖ‌రి అస్త్రం.. భార‌త్ రాకుండా ఉండేందుకు

బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయ‌ల రుణాల‌ను తీసుకుని లండ‌న్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజ‌య్ మాల్యాకు ఉన్న లీగ‌ల్ దారులు అన్ని మూసుకుపోగా.. చివ‌రిగా బ్ర‌హ్మాస్త్రం వాడేందుకు సిద్ద‌మ‌య్యాడు. భార‌తీయ బ్యాంకుల‌కు రూ.9వేల కోట్లు ఎగ‌వేసి విదేశాల‌కు పారిపోయాడు ఈ లిక్క‌ర్ కింగ్‌. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉంటున్నాడు. త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ‌వ‌ద్దంటూ లండ‌న్‌ హైకోర్టులో మాల్యా చేసిన అప్పీల్‌ను ఆ కోర్టు కొట్టివేయ‌గా.. దానిని స‌వాల్ చేస్తూ అక్క‌డి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించాడు మాల్యా. అక్క‌డ కూడా మాల్యాకు చుక్కెదురైంది. దీంతో ఆదేశంలో ఉన్న లీగ‌ల్ అవ‌కాశాలు మూసుకుని పోయాయి.

ఇక భార‌త్‌కు అప్ప‌గించ‌డ‌మే త‌రువాయి అన్న త‌రుణంలో మాల్యా చివ‌రి బ్ర‌హ్మాస్రం వాడేందుకు సిద్ద‌మ‌య్యాడు. న్యాయపరంగా అన్ని లోసుగులను వాడుకోవడంతో భారత్‌లో విచారణను తప్పించుకోవడానికి మాల్యా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు యూకే న్యాయ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ లో రాజకీయ ఆశ్రయాన్ని మాల్యా కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఆశ్రయానికి సంబంధించిన మాల్యా రిక్వెస్ట్ బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రీతిపటేల్ దగ్గరకు చేరినట్లు తెలిసింది.

ఎవ‌రైనా వ్య‌క్తి యూకేలో నిర్వాసితులుగా ఉండేందుకు అర్హ‌త పొందాలంటే.. ఆ వ్య‌క్తి సొంత దేశంలో కేసుల‌తో గానీ, రాజ‌కీయంగా, సామాజికంగా వేధించే అవ‌కాశాలు ఉన్న స్థితిలో నిర్వాసితులుగా త‌మ దేశంలో భ‌ద్రత క‌ల్పిస్తారు. అయితే.. ఇందుకు సంబంధించిన విచార‌ణ కోర్టులో సుధీర్ఘంగా సాగుతుంద‌ని, ఇందుకు రెండు సంవ‌త్స‌రాల సమ‌యం ప‌ట్ట‌వ‌చ్చున‌ని యూకేకు చెందిన ఓ న్యాయ‌వాది అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒకవేళ మాల్యా విజ్ణప్తిని యూకే హోంశాఖ తిరస్కరిస్తే..ఆ నిర్ణయాన్ని ట్రిబ్యూనల్‌లో సవాల్ చేసే హక్కు మాల్యాకు ఉంటుంది. భారత్ లో విచారణకు రాకుండా చాన్నాళ్లు తప్పించుకునేందుకు మాల్యా, అతని టీమ్ వేసిన ఓ స‌రికొత్త ఎత్తుగడ.

ఇక అవ‌కాశం ఉన్న ప్ర‌తి సారీ తాను తీసుకున్న‌ రుణాల‌ను చెల్లిస్తాన‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నాడు. అయితే.. తనపై చేసిన మనీలాండరింగ్, మోసం వంటి కేసులను మూసివేయాలని కండీష‌న్ పెట్టాడు.

Next Story