యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. ఆర్మీకి సూచనలు చేసిన చైనా ప్రెసిడెంట్

By సుభాష్  Published on  27 May 2020 9:08 AM GMT
యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. ఆర్మీకి సూచనలు చేసిన చైనా ప్రెసిడెంట్

చైనా ప్రసిడెంట్ జి జిన్ పింగ్ చైనా ఆర్మీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఆర్మీ దేనికైనా సిద్ధంగా ఉండాలని.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటూ సూచించారు. తమ దేశానికి దేని నుండి ప్రమాదం పొంచి ఉందో మాత్రం ఆయన చెప్పలేదు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్.ఏ.సి.) వద్ద చైనా సైనికులకు, భారత సైనికులకు ఈ మధ్య కాలంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకునే జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

66 సంవత్సరాల జిన్ పింగ్ రూలింగ్ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు జెనరల్ సెక్రెటరీగా ఉన్నారు. రెండు మిలియన్ల సైన్యం ఉన్న చైనాకు తాను చనిపోయే వరకూ ప్రెసిడెంట్ గానే ఉండాలని భావిస్తూ ఉన్నాడు జిన్ పింగ్. పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ, పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లతో బీజింగ్ లో నిర్వహించిన భేటీలో జిన్ పింగ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మిలిటరీ అన్నిటికీ సిద్ధపడే ఉండాలని, ముఖ్యంగా సైనికులకు కఠినమైన ట్రైనింగ్, ఏ క్షణంలో అయినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీకి తెలిపారు. చైనా సార్వభౌమత్వాన్ని కాపాడాలని... దేశ రక్షణే చాలా ముఖ్యం అని జిన్ పింగ్ వ్యాఖ్యలు చేశారు. చైనాకు ఇప్పట్లో ఏ ప్రమాదం ఉందో కూడా ఆయన చెప్పలేదు.

లడఖ్ లోని ఎల్.ఏ.సి., నార్త్ సిక్కిం లోని కొన్ని ప్రాంతాల్లో చైనా ఆర్మీ పెద్ద ఎత్తున మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టాలని భావిస్తోంది. 3500 కిలోమీటర్ల బోర్డర్ ను చైనా భారత్ లు పంచుకుంటూ ఉన్నాయి. ఈ మధ్య చైనా-భారత్ సైనికుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చైనాకు అమెరికాకు మధ్య కూడా సంబంధాలు బెడిసికొడుతూ ఉన్నాయి. సౌత్ చైనా సముద్రంలో అమెరికన్ నేవీ ప్రవేశించింది. కరోనా వైరస్ ను చైనా సృష్టించిందంటూ అమెరికా చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది.

Next Story