భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం.. ఎందుకంటే..

By సుభాష్  Published on  20 Jan 2020 11:10 AM GMT
భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం.. ఎందుకంటే..

ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేమని మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ పేర్కొన్నారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లమేమి కాదని చెప్పుకొచ్చారు. కాగా, గత కొన్ని నెలలుగా భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలను మలేషియా ప్రధాని విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. వాణిజ్యపరంగా భారత్‌ తో ఏర్పడ్డ విభేదాలను సరి చేసుకునేందుకు ముందుకెళ్తున్నామన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మహతీర్‌ విమర్శలు చేశారు. అలాగే ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో మహతీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ లోయ దురాక్రమణకు గురైందని విమర్శించారు. కశ్మీర్‌ లోయ దురాక్రమణకు గురైందని, ఇది తప్పుడు చర్యగా అభిప్రాయపడ్డారు. ఇలా మహతీర్‌ వ్యాఖ్యలు చేయడంపై భారత విదేశాంగ శాఖ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

భారత్‌ నిర్ణయం మలేషియాకు పెద్ద దెబ్బ

ఈ నేపథ్యంలో మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని భారత్‌ నిర్ణయించింది. ఇక మలేషియాకు అతిపెద్ద కస్టమర్‌గా ఉన్న భారత్‌.. పామాయిల్‌పై నిర్ణయం తీసుకోవడంతో మలేషియా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దాదాపు పది శాతం మేర ఎగుమతులు పడిపోయాయి. దీంతో పామాయిల్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయంతో వాణిజ్యపరంగా మలేషియా సమస్యల్లో చిక్కుకున్నట్లయింది.

భారత్‌ నిర్ణయంపై తాము ప్రతీకారానికి దిగబోం:

తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌.. తమ పామాయిల్‌ ఉత్పత్తులను భారత్‌ నిలిపివేసిన నేపథ్యంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రతీకారానికి దిగబోమని స్పష్టం చేశారు. మేం చాలా చిన్నవాళ్లము.. ప్రతీకారం తీర్చుకోలేం.. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు.

సీఏఏ ప్రవేశపెట్టడంపై మరోసారి..

ఇదిలా ఉంటే భారత్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రవేశపెట్టడం సరైందని కాదంటే మరోసారి మలేషియా ప్రధాని మహతీర్‌ అభిప్రాయపడ్డారు. ఇక గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న మత ప్రబోధకుడు జాకీర్‌ నాయక్‌ను అప్పగించే విషయంలో భారత్‌ - మలేషియాల మధ్య బేధాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. జాకీర్‌ను అప్పగించాలని భారత్‌ చాలా సార్లు కోరినా.. మలేషియా మాత్రం స్పందించలేదు. జాకీర్‌ను భారత్‌కు అప్పగిస్తే అతన్ని ఏదైన చేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేశారు మహతీర్‌. జాకీర్‌ను ఏ దేశం కూడా హాని కలిగించదని అనుకున్నప్పుడే తమదేశం నుంచి బయటకు పంపించగలమని చెప్పుకొచ్చారు.

Next Story