మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్న మాలావత్ పూర్ణ
By రాణి Published on 30 Dec 2019 6:42 PM ISTమాలావత్ పూర్ణ..అతిచిన్న వయసులోనే ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన బాలిక. 2014, మే 25వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే నాటికి మాలావత్ పూర్ణ వయసు 13 ఏళ్ల 11 నెలలు. 7 ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే ఆమె జీవిత లక్ష్యం. ఇప్పటి వరకూ 6 ఎత్తయిన పర్వతాలను అధిరోహించిందీ మాలావత్ పూర్ణ.
అంటార్కిటికీ ఖండంలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించింది. ప్రపంచంలో ఎత్తయిన పర్వతాల్లో విన్సన్ మాసిఫ్ (16,050) ఒకటి. 2014లో ఆసియా ఖండంలోని ఎవరెస్ట్ శిఖరాన్ని, 2016లో ఆఫ్రికాలోని కిలిమంజారో, 2017లో యూరప్ లోని ఎల్ బ్రస్, 2019లో సౌత్ అమెరికాలోని అకాంకాగ్వా పర్వతం, ఓసియానియా రీజియన్ లోని కార్ట్ స్నేజ్ పర్వతం, తాజాగా అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించింది మాలావత్ పూర్ణ.
శాటిలైట్ ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించిన మాలావత్ పూర్ణ తన పర్వతారోహణకు సహాయ, సహకారాలు అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఆమె కోచ్ శేఖర్ బాబుకు ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచ పర్వతారోహణ చర్రితలో పూర్ణ లక్ష్యాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతాయని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ పర్వతారోహికురాలిగా మారిన పూర్ణను చూస్తుంటే తెలంగాణకు, దేశానికి గర్వకారణంగా ఉందన్నారు.