స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యం -కమల్
By అంజి Published on 9 Dec 2019 8:28 AM ISTతమిళనాడులో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీచేయడం లేదని మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా కమల్ తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలతో బోణీ చేస్తారనుకుంటే అది కూడా వీలయ్యేలా కనిపించడంలేదు. దీంతో కమల్ హాసన్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కమల్ 2021 అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ చేసినట్టు తాజా నిర్ణయం చెబుతోందని తమిళ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రజనీకాంత్ కూడా తమతో కలిసివస్తే తమిళ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదగొచ్చన్నది కమల్ ఆలోచన కావచ్చు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రజనీకాంత్ ఎవరికీ మద్దతు తెలపడం లేదని రజనీ మక్కల్ మండ్రం ప్రకటించింది. ఆయన ఫొటోను గానీ, పేరును గానీ ఎవరైనా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ఫోరం స్పష్టం చేసింది. 2021 ఎన్నికలే లక్ష్యమని ఇప్పటికే రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 27, 30 తేదీల్లో రెండు విడతలుగా తమిళనాడులో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.