తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ ‌ఆలీకి కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  29 Jun 2020 11:34 AM IST
తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ ‌ఆలీకి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ పట్టిపీడిస్తోంది. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా, ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్‌ఆలీకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మహమ్మద్‌అలీకి చెందిన కొందరు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. అయితే మంత్రికి మూడు రోజుల కింద పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ తేలింది. కాగా, మహమూద్‌ఆలీకి అస్తమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలు పెద్దగా లేకపోయినా ముందస్తుగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గన్‌మెన్‌లకు కరోనా పాజిటివ్‌ తేలగా, హోంమంత్రి క్వారంటైన్‌ కాలేదు. ఇటీవల హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక హోంమంత్రికి కరోనా రావడంతో ఇంకెంత మందికి కరోనా వ్యాపిస్తుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.

కాగా, ఇటీవల ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌గుప్తాలకు కరోనా పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌కు తరలించారు. అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంత్‌రావు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు పిల్లల నుంచి వృద్ధుల వరకు సోకగా, ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సైతం సోకడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే వారిని ప్రతిరోజు ఎందరో కలుస్తుంటారు. ప్రజాప్రతినిధులకు సోకడంతో వారి నుంచి కరోనా సోకిన వారి సంఖ్య బాగానే ఉంటుందనే టెన్షన్‌ మొదలైంది

హోంమంత్రి ఇంటి చుట్టుపక్కల శానిటైజ్‌

కాగా, హోంమంత్రి మహమూద్‌ ఆలీకి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన ఇంటి చుట్టుపక్కల, పరిసరాల్లో మున్సిపల్‌ సిబ్బంది శానిటైజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మహమూద్‌ఆలీకి కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచన

ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాలకంటే ఒక్క హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోవడంతో హైదరాబాద్‌ను మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ను లాక్‌డౌన్‌ విధించాలనే డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. మూడు రోజుల పాటు పరిస్థితులను సమీక్షించిన తర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఒక వేళ లాక్‌డౌన్‌ విధించాలని అనుకుంటే .. మరో రెండు వారాల పాటు కఠినంగా లాక్‌డౌన్ విధించే అవకాశాలుట్లు సమాచారం.

తాజాగా నిన్న తెలంగాణలో 983 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14,419 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకూ 247 మంది మృతి చెందారు.

Next Story