'మహా' ప్రతిష్టంభన తొలగేనా.?

By Medi Samrat
Published on : 30 Oct 2019 6:38 PM IST

మహా ప్రతిష్టంభన తొలగేనా.?

మహా ప్రతిష్టంభన తొలగిపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. బీజేపీ-శివసేన మధ్య కీచులాటలకు తెరదించే దిశగా కమలదళం చర్యలు తీసుకుంటోంది. తాజాగా బీజేపీ నాయకత్వం, శివసేనకు ఓ ఆఫర్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు మంత్రివర్గంలో 13 బెర్తులు కేటాయిస్తామని సూచించింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని కోరింది. సీఎం పదవిపై రగడ చెలరేగుతున్న వేళ, ముఖ్యమంత్రి ఫడ్నవి స్ నివాసంలో బీజేపీ కీలక సమావేశం జరిగింది. బీజేపీ శాసనసభ్యులు ఫడ్నవిస్ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నరేంద్రసింగ్‌ తోమర్‌, జాతీయ ఉపాధ్యక్షుడు అవినాష్‌ రాయ్‌ ఖన్నా వచ్చారు. శివసేనతో విభేదాలు, ప్రభుత్వ ఏర్పాటు, ఇతర ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. విస్తృత మంతనాల తర్వాత ఫడ్నవిస్‌ను బీజేపీ శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. శివసేన తోనే కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శివసేనతో పెద్దగా విభేదాలు లేవని, చిన్నపాటి మనస్పర్ధలను కూర్చొని పరిష్కరించుకుంటామని ఫడ్నవిస్ చెప్పారు. పుకార్లను నమ్మవద్దని, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బీజేపీ ఆఫర్‌పై శివసేన నుంచి ఇంకా రియాక్షన్ రాలేదు. ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని, కేబినెట్‌లో సగం స్థానాలు కేటాయించాలని శివసేన పట్టుబడుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ అంశంపై రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను కూడా బయటపెట్టింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తమ డిమాండ్లపై బీజేపీ నాయకత్వం సానుకూ లంగా స్పందించకపోతే ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని తెగేసి చెప్పింది. చెప్పాల్సింది చెప్పాం-జరిగేది జరుగుతుందని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఐతే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. సీఎం సీటును పంచుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఫిఫ్టీ-ఫిఫ్టీ కాన్సెప్ట్‌కు బదులు 13-26 ఫార్మూలను తెరపైకి తీసుకొచ్చింది. మరోవైపు.. శివసేన నాయకులు గురువారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. పార్టీ శాసనసభాపక్షనేత ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.

Next Story