ముఖ్యాంశాలు

  • సర్వం శివార్పణం
  • శివ నామస్మరణతో తన్మయత్వం చెందుతున్న భక్తులు
  • గోదావరి, కృష్ణా తీరాల్లో పుణ్య స్నానాలు
  • ప్రత్యేక అర్చనలు, అభిషేకాలతో కిటకిటలాడుతున్న శివాలయాలు
  • అన్ని శివాలయాల్లో రాత్రికి శివ – పార్వతుల కల్యాణాలు..

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శైవ క్షేత్రాల్లో శివదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేసి, అర్చనలు చేస్తే..కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర జపంతో శివాలయాలు మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా ఆయా ఆలయాల పరిధిలో ఉన్న నదులు, సముద్రాలు, కోనేరులలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకున్న శివాలయాల్లో స్వామి, అమ్మవార్లు ప్రత్యేక పూజలందుకుంటున్నారు. శివ కల్యాణం జరిగిన రోజు, శివుడు లింగాకారంలోకి ఆవిర్భవించిన రోజు..ఇంకా పురాణాల ప్రకారం..వివిధ కారణాల చేత మహా శివరాత్రిని జరుపుకుంటారు. ఈ రోజున శివానుగ్రహం కోసం నియమ, నిష్టలతో ఉపవాసం, జాగరణ చేస్తారు. అలాగే మహా శివరాత్రితో చలి కూడా శివ శివ అని వెళ్లిపోతుందని, తర్వాత నుంచి వేసవి మొదలవుతుందని పెద్దలు చెబుతుంటారు.

తెలుగు రాష్ర్టాల్లో ఉన్న అన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగ లో పుణ్యస్నానాలాచరించి..పితృదేవతలకు తర్పణాలు పెడుతున్నారు. అలాగే పితృదేవతలకు తర్పణం పెట్టేందుకు..కృష్ణాజిల్లాలోని పెద్దకళ్లేపల్లి బాగా పేరుపొందిన శివ క్షేత్రం. ఈ క్షేత్రంలో శివుడు..శ్రీ దుర్గా నాగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఇక్కడ కృష్ణానదీ తీరాన స్నానం చేసి పితృదేవతలకు తర్పణం పెట్టి..బ్రాహ్మణులకు దానాలు ఇస్తుంటారు. ఇక్కడ ఉన్న మరొక విశేషమేమిటంటే..కృష్ణానది రెండుగా కనిపిస్తుంటుంది. సగం వరకూ తేటగా ఉండే నీరు..మిగతా సగం మట్టితో ఉన్న నీరు కనిపిస్తుంది. పెద్ద కళ్లేపల్లి భారతదేశంలో రెండవ కాశీగా పేరు పొందింది.

Edu Payalaశివరాత్రి జాతరకు మెదక్ జిల్లాలోని ఏడుపాయల పెట్టింది పేరు. ఈ ఏడాది మహా శివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి హరీష్ రావు వైభవంగా ప్రారంభించి..వనదుర్గామాతకు పట్టు వస్ర్తాలను సమర్పించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

Vemulawada High Way 2

Vemulawada High Wayవేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి..రాజన్నను దర్శించుకుంటున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. రాజన్న ఆలయానికి వెళ్లే దారిలో కూడా ప్రత్యేకంగా విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.

Srikalahastiదక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భక్తులు శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం కోసం బారులు తీరారు. అలాగే మహా శివరాత్రి సందర్భంగా ఏకాదశ అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఆలయ పండితులు. ఆలయ మంటపాలను అలంకరించేందుకు 8 టన్నుల పండ్లు, పూలను బెంగళూరు నుంచి తెప్పించారు. పళ్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన ఆలయ పరిసరాలు భక్తులను మైమరపిస్తున్నాయి. స్వామి వారి రథోత్సవం, కల్యాణోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు.

మహా శివరాత్రి సందర్భంగా ఒంగోలు విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కోటి రుద్రాక్షల పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటి వరకూ వారణాసిలో మాత్రమే ఉన్న కోటి రుద్రాక్షల మండపం..ఇప్పుడు ఒంగోలులో కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రుద్రాక్షల పందిరిని సందర్శించారు.

Sivaratri Celebrations In Vijayawada 2విజయవాడ ఇంద్రకీలాదిపై కొలువున్న కనదుర్గాలయానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి కొండ శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. పవిత్ర కృష్ణానదిలో స్నానాలాచరించి..కొండపై ఉన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆలయం లోపల ఉన్న శివాలయంలో అభిషేకాలు చేయించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే యనమలకుదురులో వేంచేసియున్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని విద్దుద్దీపాలతో అలంకరించారు. విద్యుద్దీపకాంతులీనుతున్న రామలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు.

రాజమండ్రిలో గోదావరి తీరాన భక్తులు మహా శివరాత్రిని పురస్కరించుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారు. కాగా..గోదావరిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులెర్కోవాల్సి వస్తోంది. బురద నీటిలోనే పుణ్యస్నానాలు చేయాల్సిన పరిస్థితి. పుష్కర ఘాట్, కోటిలింగాలలో భక్తులు స్నానాలు చేశారు. శివరాత్రి పుణ్య స్నానాల కోసం గురువారం డొంకరాయి రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీరు వదిలినా..ఇంత వరకూ అవి రాజమండ్రికి చేరుకోలేదు. ఈరోజు సాయంత్రానికి గాని ఆ నీరు గోదావరికి చేరుకుంటుందని అధికారులు చెప్తున్నారు.

Ujjaini Mahakaleswara Templeతంజావూరులోని బృహదీశ్వరాలయం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం , భువనేశ్వర్ లోని లింగరాజ్ ఆలయం, బ్రహ్మేశ్వరాలయం, సోమనాథ్ లోని శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం, త్రిశూర్ లోని వడక్కునాథన్ ఆలయం, ఓంకారేశ్వరాలయం, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, కాంచీపురంలోని ఏకాంబరేశ్వరాలయం, ఢిల్లీలోని లక్ష్మీనారాయణ ఆలయం, చెన్నైలోని త్యాగరాజ ఆలయం, తిరుక్కడయూర్ లోని శ్రీ అభిరామి అమ్రితకాదేశ్వరార్ ఆలయం, తిరునళ్ళార్ లోని దర్బారణ్యేశ్వరార్ ఆలయం..ఇలా దేశంలో ప్రసిద్ధి గాంచిన శివ క్షేత్రాల్లో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అభిషేక ప్రియుడైన ఆ పరమేశ్వరుడికి వేకువ జాము నుంచే పంచ తీర్థాలతో అభిషేకాలు చేస్తున్నారు.

Karnataka Special Sivalingamకర్ణాటకలోని కలబురగిలో అక్కడ లభించే గింజలతో 25 అడుగుల ఎత్తు శివలింగాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మ కుమారీలు. ఈ శివలింగం ఏర్పాటుకు 300 కేజీల గింజలను ఉపయోగించినట్లు వారు తెలిపారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.