కటింగ్‌ షాపునకు వెళ్లిన ఆరుగురికి కరోనా వైరస్‌

By సుభాష్  Published on  26 April 2020 2:29 PM IST
కటింగ్‌ షాపునకు వెళ్లిన ఆరుగురికి కరోనా వైరస్‌

దేశ వ్యాప్తంగా కరోనా కాలరాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌ జిల్లా బార్గావ్‌ గ్రామంలో ఓ కటింగ్‌ షాపునకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల ఇండోర్‌ నుంచి స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడు ఏప్రిల్‌ 5న ఓ కటింగ్‌ సెలూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇక అదే షాపునకు వెళ్లిన మరో ఆరుగురు గ్రామస్తులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ముందుగా కరోనా ఎలా సోకిందని ఆరా తీయగా, ఈ విషయం బయటపడింది. వారితో కాంటాక్టు ఉన్న 12 మందిని క్వారంటైన్‌కు తరలించారు. దీంతో అధికారులు గ్రామాన్ని సీజ్‌ చేశారు. వీరందరికి ఒకే టవల్‌, పనిముట్లు వాడటంతోనే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.

కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 1952 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 92 మంది మృతి చెందారు. ఇక 210 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Next Story