మధ్య ప్రదేశ్‌ రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వాన్ని బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొస్తున్న సీఎం కమల్‌నాథ్‌కు జ్యోతిరాదిత్య సింధియా రూపంలో గట్టి ఎదురు దెబ్బతగిలింది. దీంతో అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత పదిహేను నెలల క్రితం మధ్య ప్రదేశ్‌లో స్వల్ప మెజార్టీతో బీజేపీ యేతర పార్టీలను కలుపుకొని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా కమల్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టారు. కమల్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎం పీఠాన్ని ఆశించిన మరో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాధిత్య సింధియాకు సీఎంకు మధ్య వర్గవిబేధాలు కొనసాగుతూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తో పాటు 22మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వీడారు. వీరిలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. తిరుగుబాటు తరువాత ఆరుగురు మంత్రులను కమల్‌నాథ్‌ పదవుల నుంచి తొలగించారు.

మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 మంది సభ్యులున్నారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 116 ఉండాలి. వీరిలో కాంగ్రెస్‌కు 114, విపక్ష భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్రులు నలుగురు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సమాజ్‌ వాజ్‌ పార్టీకి చెందిన ఒకరు ఉన్నారు. బీజేపీ యేతర పార్టీల ఎమ్మెల్యేలంతా కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. దీంతో 121 మంది ప్రభుత్వానికి మద్దతు ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం  సింధియా తిరుగుబాటు  జెండా ఎగురవేయడంతో 22మంది కాంగ్రెస్‌ పార్టీని వీడిపోయారు. వీరంతా బీజేపీకి మద్దతుగా ఉన్నారు.

దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. బీజేపీ ప్రతిపక్ష నేత , మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ పలువురు ఎమ్మెల్యేలతో  గవర్నర్‌ లాల్జీ టాండర్‌ను కలిశారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనేంత బలం ఉందని, బలపరీక్షకు ఆదేశించాలని కోరారు. గవర్నర్‌ స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాప్రతికి సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ ఆదేశించారు. దీంతో ఇరు పార్టీల వర్గాల్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి.

మధ్య ప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ఆదివారం భోపాల్‌ కేబినెట్‌ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం స్వతంత్ర్య ఎమ్మెల్యే ప్రదీప్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. మా వద్ద బలపరీక్షలో నెగ్గడానికి అవసరమైన ఎమ్మెల్యేల బలం ఉందని, సీఎం కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారని  తెలిపారు. కొంత సమయం వేచి చూడాలని తెలిపారు. ఇదిలా ఉంటే విశ్వాస పరీక్ష సోమవారం జరుగుతుందో లేదో చూడాలని, కరోనా కారణంగా అసెంబ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరిని తిరిగి బోపాల్‌కు రప్పించారు. మరోవైపు బీజేపీ సైతం సోమవారం జరిగే విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉండాలని విప్‌ జారీ చేసింది. దీంతో రేపు బలపరీక్ష జరుగుతుందా..? జరిగితే కాంగ్రెస్‌ మళ్లీ అధికారాన్ని ఎలా చేజిక్కించుకో గలుగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.