అమ్మాయిని ఎరవేయి..కాంట్రాక్ట్‌ను పట్టేయి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 9:10 AM GMT
అమ్మాయిని ఎరవేయి..కాంట్రాక్ట్‌ను పట్టేయి..!

  • మధ్యప్రదేశ్ లో 'స్పైసీ ట్రాప్'
  • అమ్మాయిల వలలో మాజీ మంత్రులు, అధికారులు
  • రాకెట్ సూత్రధారులు శ్వేతా, ఆర్తి అరెస్ట్
  • మధ్యరాజకీయాల్లో 'స్పైసీ ట్రాప్' కలకలం

మధ్యప్రదేశ్‌: "బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు" అనే సామెత తెలుగులో ఫేమస్. అమ్మాయిల దెబ్బకు అధికారులైనా, రాజకీయ నాయకులైనా దొరికిపోవాల్సిందే..!.మధ్యప్రదేశ్‌లో ఇదే జరిగింది. కాలేజ్‌లకు వెళ్లే అమ్మాయిలకు జల్సా, లగ్జరీ లైఫ్ ఎరవేసివారినే అస్త్రాలుగా చేసుకుని అధికారులు, రాజకీయ నేతల మీదకు వదిలారు. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఫైళ్ల మీద సంతకాలు చేయించుకుని కాంట్రాక్ట్‌లు పొందారు. వాటిని వీడియోలు తీసి ..బ్లాక్‌ మెయిల్ చేసి మరిన్ని పనులు చేయించుకున్నారు. ఈ 'స్పైసీ ట్రాప్‌'లో మాజీ సీఎం, మాజీ గవర్నర్, సెక్రటరీ స్థాయి అధికారులు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఏ స్థాయిలో రాకెట్ నడిచిందో. అసలు ఈ రాకెట్ ఎలా బయట పడింది..? ఈ రాకెట్ గుట్టును ఎవరు బ్లాస్ట్ చేశారు..?

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కమిషన్లు, ఇతర సౌకర్యాలు పొందే భారీ కుంభకోణం మధ్యప్రదేశ్‌లో బయటపడింది. హర్భజన్‌ అనే సీనియర్‌ ఇంజినీర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు గతవారం ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేశారు. వారిలో మోనిక యాదవ్‌ అనే యువతి రూ. 3 కోట్లు ఇవ్వాలని ఇంజినీర్ హర్బజన్‌ను డిమాండ్ చేసింది. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బ్లాక్‌ మెయిల్ చేసింది. దీంతో అధికారి హర్బజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మౌనిక పోలీసులు అరెస్ట్ చేశారు. మౌనిక చెప్పిన వివరాలతో తీగ లాగడం మొదలు పెట్టారు పోలీసులు. ఇంకేముంది..డొంక కదలడం మొదలైంది.

ఈ రాకెట్‌పై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ రాకెట్‌కు సూత్రధారి శ్వేతా జైన్‌..ఈమెకు ఆర్తి దయాల్ సాయం చేసేదని మౌనిక యాదవ్ విచారణలో వెల్లడించింది. ఈ ఇద్దరి మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యతరగతి యువతలే టార్గెట్‌గా వీరు రాకెట్‌ నడిపారు. వారి అవసరాలు తీరుస్తామంటూ రొంపిలోకి దింపారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 25 మంది యువతులను పోలీసులు గుర్తించారు. యువతలే కాకుండా ..మరో 40 మంది సెక్స్‌ వర్కర్లు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇండోర్‌కు చెందిన మౌనికను కూడా కాలేజీలో సీటు ఇప్పిస్తామని ఈ రాకెట్‌లోకి దించినట్లు తెలుస్తోంది. మౌనిక మొదట రాకెట్‌కు దూరంగా ఉండాలని స్వస్థలానికి వెళ్లింది. మౌనికను వదల్లేదు. ఆర్తి మౌనిక ఇంటికి వెళ్లింది. మౌనిక చదువు ఖర్చులను తమ ఎన్జీవో నుంచి భరిస్తామని హామీ ఇచ్చింది. ఎట్టకేలకు మౌనిక తల్లిదండ్రులను ఒప్పించారు. తరువాత..ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో హర్బజన్‌ దగ్గరకు మౌనిక పంపించారు. అప్పటికే రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేశారు. ఈ గుట్టు బయట పెడితే..వీడియోలు యూ ట్యూబ్‌లో అప్‌ లోడ్ చేస్తామని మౌనికను బెదిరించారు. మౌనిక చేత హర్బజన్‌ను డబ్బులు అడిగించారు. దీంతో హర్బజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లెంట్‌తో అసలు విషయం బయటకు వచ్చింది.

శ్వేతా జైన్‌ బిగ్ ఫిష్‌లకే గాలం వేసింది. దాదాపు 8 మంది మాజీ మంత్రులతోపాటు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. పెద్దపెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇప్పించి కమీషన్లు తీసుకునే వారంటే ఏ స్థాయిలో వీరు కథ నడిపారో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు..ఐఏఎస్‌, ఐపీఎస్ బదిలీల్లో కూడా వీరి ప్రమేయం ఉండేదంటే ఎక్కడ వరకు చొచ్చుకెళ్లారో తెలుస్తోంది. శ్వేత జైన్‌ విచారణలో చెప్పే విషయాలు విని సిట్ అధికారులకు మైండ్ పోయిందంటేనే అర్ధం చేసుకోవచ్చు.

ఈ రాకెట్‌పై సిట్ వేగంగా దర్యాప్తు చేస్తుంది. అనేక మంది అధికారులను ప్రశ్నించారు. విచారణలో శ్వేతా జైన్ చెప్పిన మాజీ మంత్రులనూ విచారించారు. శ్వేత, ఆర్తిలనుంచి వందలాది ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వెయ్యి ఆడియో, వీడియో క్లిప్‌లను శ్వేతా, ఆర్తిల కంప్యూటర్ల నుంచి పోలీసులు తీసుకున్నారు.

మొత్తానికి ఈ 'స్పైసీ రాకెట్' మధ్యప్రదేశ్‌లో ప్రకంపసలే రేపింది. కొంత మంది రాజకీయ మూలాలు కూడా కదులుతున్నట్లు సమాచారం. ఈ రాకెట్ తీగను లాగుతారా?. మధ్యలోనే కమలనాథ్ ప్రభుత్వం వదిలేస్తుందా? వెయిట్ అండ్ సీ.

Next Story