నిజామాబాద్‌లో పసుపు లారీ దగ్దం.. రైతుల కష్టం ఆవిరి..

By అంజి  Published on  12 March 2020 6:33 AM GMT
నిజామాబాద్‌లో పసుపు లారీ దగ్దం.. రైతుల కష్టం ఆవిరి..

ముఖ్యాంశాలు

  • నిజామాబాద్‌ జిల్లాలో లారీ దగ్ధం
  • మంటల్లో మసైన రూ.75 లక్షల విలువ చేసే పసుపు
  • ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో ఘటన

నిజామాబాద్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. డీజిల్‌ ట్యాంకర్‌ పేలి ఓ లారీ ఆగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటన ముప్కాల్‌ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మెండోరా మండలం వెల్కటూర్‌ నుంచి నిజామాబాద్‌లోని పసుపు మార్కెట్‌కు పసుపు సంచుల లోడ్‌తో వస్తున్న లారీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు దావాణంలా వ్యాపించడంతో.. పసుపు సంచులతో పాటు లారీ పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

లారీ డ్రైవర్‌ సుధాకర్‌, క్లీనర్‌ అజయ్‌లు బయటకు దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వీరు.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌, క్లీనర్‌ ఇద్దరూ తండ్రి కొడుకులు. లారీలో 350 సంచుల పసుపు ఉందని, సుమారు 75 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రైతులు తెలిపారు. లారీ డీజిల్‌ లీక్‌ కావడంతో మంటలు అంటుకొని ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట బుగ్గి పాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రాజ్‌ భరత్‌రెడ్డి పరిశీలించి.. వివరాలు సేకరిస్తున్నారు.

Next Story