లండన్ వేదికగా స్వరవీణాపాణి గిన్నిస్ రికార్డు ప్రయత్నం
By న్యూస్‌మీటర్ తెలుగు
లండన్: స్వరవీణాపాణి...వోగేటి నాగ వెంకట రమణ మూర్తి...సంగీత ప్రపంచంలో ఈ పేరు వినని వారుండరు. మిథునం, దేవస్థానం, పట్టుకోండి చూద్దాం వంటి విజయవంతమైన తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడిగా అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుస్వర బ్రహ్మ. లాంగెస్ట్ మారథాన్ చర్చ్ ఆర్గాన్ ప్లేయింగ్ అనే అంశంతో 72 మేళకర్త రాగాలను తన సంగీత సాధనంపై వాయిస్తూ సుదీర్ఘమైన సంగీతాలాపనతో ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ వరల్డ్ రికార్డు సాధనకై ఉద్యుక్తులయ్యారు. లండన్ లోని హ్యామర్ స్మిత్ ప్రాంతానికి చెందిన ద భవన్ ప్రాంగణంలో యూకే కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటలకు గిన్నిస్ రికార్డు ప్రయత్నం ప్రారంభమైంది.
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, అమెరికాకు చెందిన వెన్నం ఫౌండేషన్, భారత దేశానికి చెందిన స్వరనిధి సంస్థ వారి సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రికార్డు తెలుగువారి సంగీత వైభవాన్ని, యావత్ భారతదేశ ఘనకీర్తిని దశదిశలా వ్యాప్తి చెందించే చారిత్రక అంశం అవుతుందని సంగీత సామ్రాట్టుల, తెలుగు వారి ఆకాంక్ష. 64 గంటలకు పైగా కొనసాగే ఈ ప్రయత్నం లండన్ కాలమానం ప్రకారం గాంధీ జయంతి రోజున రాత్రి పది గంటల ప్రాంతంలో ముగుస్తుంది. కార్యక్రమంలో గిన్నిస్ నియమ నిబంధనలను గిన్నిస్ రికార్డు గ్రహీత, తెలుగువాడైన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి చదివి సభికులకు తెలియజేశారు.
(లండన్ నుంచి.... డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి)