'సాక్షి'పై ట్విటర్ బాంబ్ పేల్చిన లోకేష్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 12:10 PM GMT
సాక్షిపై ట్విటర్ బాంబ్ పేల్చిన లోకేష్..!

అమరావతి: అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక 'సాక్షి' అని నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్‌ ఢిల్లీ ఎందుకు వెళ్లారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని స్థితిలో 'సాక్షి' ఉందన్నారు. నీతిలేని కథనాలతో దుష్ప్రచారాలు మొదలుపెట్టిందన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా నేను విశాఖ ఎయిర్‌పోర్టులో కూర్చొని తిన్న చిరుతిళ్ల కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టనంటూ సాక్షి ఓ అసత్య కథనాన్ని వండి వార్చిందని నారా లోకేష్‌ అన్నారు. ఆధారాల కోసం వాళ్లు చూపించిన ఫుడ్‌ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నట్టు చూపించారు. ఐదేళ్ల ఏపీ సర్కార్‌ ప్రోటోకాల్‌ ఖర్చు నాకు జమ వెయ్యమని దొంగబ్బాయ్‌ ఆర్డర్‌ వేసారా? అంటూ సాక్షిని నారా లోకేష్‌ ప్రశ్నించారు. ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోవడానికి సిగ్గుండక్కరలేదా? అని లోకేష్‌ మండిపడ్డారు. చిల్లర కథనాలు అపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం చేస్తారు నేరగాళ్లు.. సాక్షి నాపై బురద చల్లుతూ అలాంటి తప్పులనే చేసిందని లోకేష్‌ ఆరోపించారు.

నారా లోకేష్‌ మాటాల్లో.. 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్‌ పోర్టులో రూ.67,096 వేల బిల్లు చేసినట్టు రాశారు. అక్టోబర్‌ 30, 2018న నేను పొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరైతే ఆ రోజు విశాఖ ఎయిర్‌పోర్టులో అయిన రూ.79,170ల బిల్లును కూడా నా అకౌంట్‌లో వేశారు. ఎయిర్‌పోర్టులో ప్రభుత్వ వీఐపీలందరి కోసం అయిన బిల్లుల్ని నా ఒక్కడి పేరునే వేసి ప్రచారం చేయడం సాక్షి లాంటి నీతిమాలిన మీడియాకే సాధ్యమని ట్విటర్‌ వేదికగా నారా లోకేష్‌ అన్నారు.









Next Story