మిడతల దాడితో కుదేలైన రాజస్థాన్ రైతులు
By Newsmeter.Network Published on 18 Jan 2020 12:31 PM ISTముఖ్యాంశాలు
- తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో రాజస్థాన్ లో మిడతల దాడి
- 60 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా మిడతల దాడి
- మూడున్నర లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం
- 75 శాతం పంటను పూర్తిగా తినేసిన మిడతలు
- పాకిస్తాన్ నుంచి తరలివస్తున్న మిడతల దండు
- ఖరీఫ్, రబీ పంటల్ని పూర్తిగా పాడుచేసిన మిడతలు
- భారీగాపురుగుమందులు కొట్టినా ఉపయోగం లేదు
బికనీర్ : మిడతల దాడిలో రాజస్థాన్ కుదేలైపోయింది. గడచిన 60 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా పశ్చిమ రాజస్థాన్ లోని 10 జిల్లాల్లో పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. దాదాపుగా మూడున్నర లక్షల హెక్టార్లకు పైగా పంట మిడతల దాడిలో పూర్తిగా పాడైపోయింది.
మిడతల దండు దాదాపుగా 75 శాతం పంటను తినేసి పూర్తిగా నిర్వీర్యం చేసిపారేశాయి. శ్రీ గంగానగర్, హనుమాన్ ఘర్, బికనీర్, జైసల్మేర్, బర్మేర్, జోథ్ పూర్, జలోరే, శిరోహి, నాగర్, చురు జిల్లాల్లో మిడతల దాడివల్ల పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు.
కిందటి ఏడాది మే నెలలో ఉత్తర పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎర్ర మిడతల దండు ఈ పది జిల్లాల్లో ఖరీఫ్ పంటల్ని పూర్తిగా నాశనం చేసేసింది. ఇప్పుడు మళ్లీ రబీ పంటల్నికూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన వైనం అత్యంత హృదయవిదారకమైన దృశ్యాలను కళ్లకు కడుతోంది.
గడచిన అరవై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున మిడతల దాడిని ఎప్పుడూ చూడలేదని ఈ పది జిల్లాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిందటిసారి మిడతల దండు పంటల్ని నాశనం చేసినప్పుడు దురదృష్టం అనుకుని భరించిన రైతులు, ఇప్పుడు ఆ దురదృష్టానికి ఇది పరాకాష్టగా భావిస్తున్నారు.
2019 మే నెలలో ఈ సంవత్సరం రాజస్థాన్ మిడతల దాడి పాల బడింది. వాటిని అదుపు చేసేందుకు, పంటల జోలికి రానివ్వకుండా ఉండేందుకు రైతులు పెద్ద ఎత్తున విపరీతంగా పురుగుమందులుకూడా కొట్టారు పంటలకు. కానీ అవేవీ మిడతల దండుమీద ప్రభావం చూపించలేకపోయాయి. మిడతలు లక్షల సంఖ్యలో విరుచుకుపడి పంటల్ని పూర్తిగా నాశనం చేసేశాయి.
“వాతావరణం బాగుండడం, గాలిలో తేమ, పచ్చటి పొలాలు ఇవన్నీ మిడతల్ని అమితంగా ఆకర్షించే అంశాలు. అందుకే అవి పూర్తి స్థాయిలో విరుచుకుపడి వీర విహారం చేసి పంటల్ని నాశనం చేశాయి” అని రాజస్థాన్ పెస్ట్ కంట్రోల్ అధికారులు అంతా అయిపోయాక తీరికగా ముచ్చట్లు చెబుతున్నారు.
కిందటి ఏడాది తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో మిడతలు దాడి చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదనీ, దానివల్లే ఇప్పుడు రైతులకు ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఎదురయ్యిందనీ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ పెస్ట్ కంట్రోల్ అధికారులకు కనీసం ఇప్పటివరకూ కిందటి ఏడాది జరిగిన పంట నష్టాన్ని అంచనావేయడానికి కూడా తీరిక లేదనీ, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం మిన్నకుండడం మరీ విడ్డూరంగా ఉందని బాధపడుతున్నారు.
రైతులు ఈ మిడతల దండు దాడిలో పూర్తిగా నష్టపోయినందున వీళ్లందరికీ ఎకరానికి ఇరవై వేల రూపాయలు పరిహారం ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశామనీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని సానుకూలంగా పరిశీలిస్తే రైతులు గండంనుంచి గట్టెక్కుతారనీ అధికారులు చెబుతున్నారు. అలా జరగని పక్షంలో మిడతల దండు దాడిలో నష్టపోయిన రైతులు కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందోకూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి రాజస్థాన్ లో నెలకొని ఉంది.