దేశ వ్యాప్తంగా కరోనా కాలరాస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. వైరస్‌ను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే కాకుండా సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నారు. మూడో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా దేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలను తిరిగి తెరిచేందుకు సిద్దమయ్యారు అధికారులు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో గుజరాత్‌ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ నగరంలో పెద్ద సంఖ్యలో కరోనా బాధితులతో పాటు మరణించిన వారు కూడా చాలానే ఉన్నారు. ఇప్పటికే గుజరాత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 4,721 ఉండగా, 236 మంది మృతి చెందారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజ్‌కోటలోని స్వామి వివేకానంద ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులంతా క్లాసులకు రావాలని, అది కూడా మాస్క్‌లు తప్పని సరి అని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు అధికారులు. దీంతో విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాల తెరుచుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇలాంటి విపత్కర సమయంలో పాఠశాల తెరుచుకోవడంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.