బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో బస్సులన్ని నడుస్తాయి: సీఎం కేసీఆర్
By సుభాష్ Published on 18 May 2020 2:33 PM GMTతెలంగాణలో మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల1452 కుటుంబాలు కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్నారని, కంటైన్‌మెంట్ జోన్‌లు తప్పా మిగతావన్నీ గ్రీన్‌జోన్‌లలో ఉంటాయన్నారు. కంటైన్‌మెంట్ జోన్లో ఉన్నవారికి ప్రభుత్వమే వస్తువులను సరఫరా చేస్తుందని అన్నారు. అయితే రాష్ట్రంలో హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో షాపులు తెరుచుకోవచ్చని ప్రకటించారు.
అలాగే హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో బస్సులు నడుస్తాయని తెలిపారు. కరోనాతో ప్రజలు జీవించడం నేర్చుకోవాలని అన్నారు. అలాగే బస్సుల్లో ప్రయాణించే వారు మాస్క్‌లు తప్పని సరి అని, ప్రయాణికులు నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వెంటనే చర్యలు తీసుకోబడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్యాక్సీలు, ఆటోలు కూడా నడుపుకోవచ్చని చెప్పారు.
ఇక మే 31వ తేదీ వరకూ అన్ని రకాల విద్యాసంస్థలు బంద్ ఉంటాయని, మెట్రో రైలు నడిచేందుకు అనుమతి ఉండదని అన్నారు. అలాగే సెలూన్లు కూడా తెరుచుకోవచ్చని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో తెరిచే షాపులు సరి-బేసి పద్దతిలో తెరుచుకోవాలని సూచించారు. అలాగే సిటీ బస్సులు, రాష్ట్రాల మధ్య ఎలాంటి బస్సులు నడవవని, మిగిలిన బస్సులన్ని నడుస్తాయని స్పష్టం చేశారు.
అలాగే అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలకు అనుమతి లేదు. సెలూన్ షాపులకు అనుమతి ఇచ్చినా.. కంటైన్‌మెంట్ జోన్లలో అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ఆటోల్లో ఇద్దరు, ట్యాక్సీలో ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. మాస్కులు లేకుండా తిరిగే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని అన్నారు. అలాగే ఈ-కామర్స్ అన్నింటికీ అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.