లాక్ డౌన్ ఎత్తివేత.. అక్కడ ఎటువంటి మార్పులు వచ్చాయంటే..?

By అంజి  Published on  8 April 2020 6:35 AM GMT
లాక్ డౌన్ ఎత్తివేత.. అక్కడ ఎటువంటి మార్పులు వచ్చాయంటే..?

వుహాన్.. కరోనా మహమ్మారి పుట్టినిల్లు..! ఈ పేరు వింటేనే అందరూ భయపడుతూ ఉన్నారు. కొన్ని నెలలుగా కరోనా మహమ్మారితో పోరాడింది ఈ నగరం. అధికారిక లెక్కలు ఓ విధంగా ఉన్నా.. కొన్ని వేల మంది చనిపోయినట్లు చెబుతున్నారు. ఇక్కడ పుట్టిన మహమ్మారి ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఏవో కొన్ని దేశాలు తట్టుకుని బ్రతుకుతున్నాయి అంతే..! గ్లోబల్ ఎకానమీని కూడా షేక్ చేసి పారేసింది. అక్కడి అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సమస్యను ఓ కొలిక్కి తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు బాగా తగ్గాయని అంటున్నారు.

10 వారాలకంటే ఎక్కువ రోజులు లాక్ డౌన్ ను పాటించిన ఈ నగరం ప్రస్తుతం రికవరీ అయినట్లు భావిస్తున్నారు అధికారులు. అందుకే లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. వుహాన్ లో ఇప్పుడు జరిగిన నష్టం కొన్ని దశాబ్దాల పాటూ ఇబ్బంది పెట్టొచ్చని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ప్రజల్లో పాకిన వైరస్ భయం, వేలల్లో మృత్యువాత పడ్డాన్ని దగ్గరగా చూసిన ప్రజలు.. అది మరిచిపోవడం చాలా కష్టమే..! లాక్ డౌన్ ఎత్తివేయగానే వ్యాపారాలు మొదలు పెడదాం అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వ్యాపారాల్లో వచ్చిన నష్టం.. మళ్లీ మొదలుపెడితే అదే స్థాయిలో ప్రజలు వస్తారా అన్నది కూడా వారికి ఇప్పుడు అనుమానమే.. అందుకే లాక్ డౌన్ ఎత్తి వేసినా బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. జనజీవనం సాధారణ స్థితికి అయితే రాలేకపోతోంది. ఆ ప్రాంతానికి బయట నుండి ఎవరెవరు వస్తున్నారు.. ఎవరెవరు వెళ్తున్నారు అన్నదానిపై నిఘా ఉంచారు అధికారులు.

ఇండస్ట్రియల్ హబ్ అయిన వుహాన్ లో 11 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు.. మహమ్మారి ప్రబలినప్పుడు అధికారులు మొత్తం ప్రాంతాన్ని సీల్ చేశారు. ఎవరూ బయటకు వెళ్లకుండా.. ఇంకెవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల రాకపోకలపై.. వారి మనుగడపై నిఘా పెట్టారు.. అలాగే కఠినమైన నిబంధనలను కూడా అమలు చేశారు.

డెత్ రేట్ కాస్త తగ్గుముఖం..

ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్లు 14 లక్షలను దాటాయి.. 80000 మరణాలకు పైగా ఇప్పటి వరకూ నమోదయ్యాయి.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడం అధికారులకు కూడా చాలా కష్టమవుతోంది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో విపరీతంగా ప్రబలింది.. ప్రస్తుతం డెత్ రేట్ కూడా కాస్త తగ్గింది. అమెరికాను కూడా అతలాకుతలం చేసింది. 400000 ఇన్ఫెక్షన్లు అమెరికాలో సోకాయి. న్యూయార్క్ లో ఆసుపత్రులు పూర్తిగా నిండిపోవడం, ఈక్వడార్ రోడ్ల మీద శవాలు పడిండడం.. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కు కరోనా సోకడం వంటి చాలా విషయాలు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి కారణంగా చోటుచేసుకున్నవే..! యూరప్, భారత్, చాలా దేశాలు లాక్ డౌన్ ను పాటిస్తూ ఉన్నాయి. ఇళ్లల్లో ఉంటేనే ప్రాణాలను కాపాడుకోవచ్చు అని ప్రజలకు చెబుతూ ఉన్నాయి. చాలా మంది ఉపాధిని కోల్పోయారు.

చాలా కంపెనీలు మూసేయడం, ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోనున్నాయి. ఇదంతా మొదట వుహాన్ నుండే మొదలు కాబోతోంది. జనవరి నెలలో నుండి చైనాలో ప్రతి రోజూ మరణానికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. కానీ మొదటిసారి చైనాలో మరణం లేదంటూ ప్రకటించారు ఆ దేశ అధికారులు. బుధవారం నాడు వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేస్తూ ఉన్నారు. గత మూడు వారాల్లో ఆ ప్రాంతంలో కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అవుట్ బౌండ్ ట్రావెల్ ను కూడా అర్ధరాత్రి చైనాలో ఎత్తివేశారు. ప్రభుత్వం ఇచ్చిన యాప్ ఆధారంగా వారు ప్రయాణాలు మొదలు పెట్టవచ్చట. ఆ యాప్ లో వారి ఆరోగ్య పరిస్థితి.. వైరస్ సోకే రిస్క్.. ఇంటి అడ్రెస్ లాంటివన్నీ ఉంటాయి.. బుధవారం తెల్లవారుజామునే వుహాన్ లో కార్లు పరుగులు తీయడం మొదలైన విజువల్స్ బయటకు వచ్చాయి. టోల్ స్టేషన్స్ బిజీ అవ్వడం మొదలైంది. బుధవారం నాడు 55000 మంది వుహాన్ నుండి ట్రైన్స్ లో బయలుదేరే అవకాశం ఉందని అక్కడి రైల్వే ప్రకటించింది.

బయటకు రావడానికి ఇష్టపడని వుహాన్‌ ప్రజలు..

సిటీలో ఇంకా వ్యాపారాలపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇళ్లల్లో ఉంటేనే మంచిదని అధికారులు సూచిస్తూ ఉన్నారు. స్కూల్స్ ఇంకా మూసివేసే ఉంచారు. వుహాన్ ప్రజలు చాలా మంది సిటీని విడిచి వెళ్లాలని అనుకోవడం లేదు. చైనాలో 80000 మందికి కరోనా వైరస్ సోకగా.. అందులో సింహభాగం వుహాన్ వాసులే..! వుహాన్ ప్రజలు మానసికంగా కూడా బాగా దెబ్బతిన్నారు. చాలా మంది బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు.

వుహాన్ మునుపటిలా అయితే లేదని.. ఉండబోదని కూడా అంటున్నారు. ఈ మధ్యనే కొన్ని షాపులు తెరచుకోగా.. రోడ్ల మీద కూరగాయలు, మందు, సిగరెట్లు వంటివి అమ్మడం మొదలుపెట్టారు. అక్కడి పార్కుల్లోకి కూడా కొన్ని కుటుంబాలు వస్తున్నాయి. స్థానికులు చిన్న చిన్న గ్రూపులుగా వచ్చి మాట్లాడుకోవడం, చైనీస్ చెస్ ఆడుకోవడం వంటివి చేస్తున్నారు. పిల్లలు చాలా అరుదుగా బయట కనిపిస్తూ ఉన్నారు.. అది కూడా తల్లిదండ్రుల సమక్షంలోనే బయటకు వస్తున్నారట. పబ్లిక్ బస్సులు, సబ్ వే ట్రాన్స్పోర్ట్ వంటివి మొదలైనా ప్రయాణీకులు చాలా తక్కువగా ఉన్నారు.

ఆన్ లైన్ షాపింగ్ లో తీసుకుని వచ్చిన బాక్సులన్నీ అపార్ట్మెంట్ల బయట పడి ఉన్నాయి. ఈ మధ్యనే ఆన్ లైన్ వ్యాపారాలు కూడా పెరిగినట్లు చెబుతున్నారు. చాలా కంపెనీలు ఉద్యోగులను పని చేయడానికి రమ్మని కోరుతున్నాయట. 94 శాతం సాధారణ బిజినెస్ లు తిరిగి ఓపెన్ అయ్యాయని సిటీ మేయర్ చెబుతున్నారు. ఇక కంపెనీలు, ఇండస్ట్రీలు తమ తమ పనులను తిరిగి మొదలు పెట్టాయట. హోండా లోకల్ వెంచర్ లో కూడా పనులు మొదలయ్యాయి. తిరిగి వుహాన్ సాధారణ స్థాయికి తీసుకుని రావడానికి అధికారులు, ప్రభుత్వం పని చేస్తున్నాయట. కానీ ప్రజలే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కాలమే నిర్ణయిస్తుంది.

Next Story