లాక్‌డౌన్‌: మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.!

By అంజి  Published on  7 April 2020 4:31 PM IST
లాక్‌డౌన్‌: మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.!

హైదరాబాద్‌: ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని గైనకాలజిస్టులు అంటున్నారు.

'అందరీలాగే మహిళలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ అనేది పాటించాలి. సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఇంట్లో ఉన్న సమయంలో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. మహిళలు ఇంట్లో వంట చేసిన సమయంలో, బయటి నుంచి కూరగాయలు వచ్చినప్పుడు కొనడం.. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వంట చేసిన తర్వాత, వంట చేయక ముందు కూడా చేతులు కడుక్కోవాలి. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు' అని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్‌ పి.బాలంబ చెప్పారు.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలి. చిన్న పిల్లలకు బొమ్మలు గీయమని చెప్పడం లేదా కథలు చెప్పడం లాంటివి చేయాలి. అష్టా చమ్మ లాంటి ఆటలు ఆడిపించడం మేలు. అదే సమయంలో పిల్లలకు చిన్న చిన్న పాఠాలు బోధించాలి.

ఇక గర్భిణీ స్త్రీలు కూడా కరోనా వైరస్‌ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీకి కరోనా సోకితే.. అది కడుపులో ఉన్న బిడ్డకు కూడా సోకుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. గర్భంతో ఉన్న స్త్రీలు ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లకూడదని గైనకాలజిస్టులు అంటున్నారు. ఎమర్జెన్సీ అయితే.. ముందుగానే డాక్టర్‌కి కాల్‌ చేసి 'ఇలా ఉంది నా పరిస్థితి.. ఆస్పత్రికి రావాలా.. అక్కర్లేదా.' అన్న దానిపై క్లారిటీ తీసుకోవాలి. డాక్టర్‌ ఇచ్చే సలహాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలి. మొదటి ఏడు నెలల వారికి మమూలుగా ఎలాంటి సమస్యలు ఉండవు. తొమ్మిది నెలల దగ్గర పడేవారికి మాత్రం నొప్పులు, నీరు వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో మాస్కు వేసుకొని వెళ్లడం చాలా ముఖ్యం.

Next Story