ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినం.. ఎందుకంటే..?

By Newsmeter.Network  Published on  3 April 2020 7:59 AM IST
ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినం.. ఎందుకంటే..?

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 14 వరకు లాక్‌ డౌన్‌కు పిలుపునివ్వగా దేశ వ్యాప్తంగానే కాక తెలంగాణలోనూ పకడ్బందీగా సాగుతుంది. ప్రజలంతా ఇండ్లకే పరిమితమైయ్యారు. ఇదిలాఉంటే గత మూడు రోజులుగా తెలంగాణలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం ప్రభుత్వాన్ని, ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read :లాక్‌డౌన్‌ నిబంధనలు.. ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు.!

ఢిల్లిలోని నిజాముద్దీన్‌లో మత పరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. తెలంగాణ నుంచి వెయ్యికిపైగా మంది ఢిల్లి వెళ్లొచ్చారు. వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ పాతబస్తీ, నిజామాబాద్‌, నిర్మల్‌, గద్వాల్‌, బైంసా, మిర్యాలగూడలపై ప్రత్యేక దృష్టిసారించి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో 153 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 17మంది కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. తొమ్మిది మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 మంది కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు చికిత్స నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎక్కువ మంది ఢిల్లిలోని మత ప్రార్థనలకు వెళ్లొచ్చినవారే ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లి నుంచి వచ్చిన వారిలో చాలా మంది బయట తిరిగారు. తమతమ ప్రాంతాల్లో పలువురిని కలిశారు. లాక్‌ డౌన్‌ను ఉల్లంఘించి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read :ఏపీని వ‌ణికిస్తున్న క‌రోనా.. 152కు చేరిన కేసులు

మరోవైపు ఢిల్లి వెళ్లొచ్చినవారి జాబితాలో మరికొందరి ఆచూకీ దొరకాల్సి ఉంది. వీరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినం చేయనుంది. ఈ ప్రాంతాల్లో మూడు కి.మీ పరిధి వరకు ఎవరినీ అనుమతించరు. ఇదిలాఉంటే తెలంగాణలో పాజిటివ్‌ వస్తున్న ఢిల్లి మర్కజ్‌ కేసులన్నింటిని నేరుగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు లేదా వారికి సంబంధించి కరోనా నెగటివ్‌ వచ్చిన వ్యక్తులందరిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ క్వారంటైన్‌లోనే ఉంచాలని నిర్దేశించారు.

Next Story