లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణలో తగ్గిన క్రైం రేటు

By Newsmeter.Network  Published on  9 April 2020 12:37 PM GMT
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణలో తగ్గిన క్రైం రేటు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వంసైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గత నెల 24 నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు నిమిత్తం మినహా మిగిలిన పనులపై ఎవరైన బయటకు వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు పల్లెల్లోనూ పోలీస్‌ బందోబస్తు ఉండటం, కరోనా నేపథ్యంలో గ్రామాల్లోకి కొత్త వారు ఎవరూ రాకుండా గ్రామస్తులే కంచెలు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read :కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏడాది పాటు వారి వేతనాల్లో..

అడుగడుగునా పోలీస్‌ బందోబస్తు ఉండటంతో తెలంగాణలో క్రైమ్‌రేట్‌ భారీగా తగ్గినట్లు పోలీస్‌ శాఖ పేర్కొంది. గతంలో దొంగతనాల కేసులు, కిడ్నాప్‌ కేసులు ఇలా పలు కేసులతో రద్దీగా ఉండే పోలీస్‌ స్టేషన్‌ల ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. పోలీసులంతా రోడ్లపైనే ఉండటం, ప్రతీప్రాంతంలో నిఘా ఉంచడంతో దొంగలకు పనిలేకుండా పోయింది. దీంతో లాక్‌డౌన్‌ విధించిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో 56శాతం క్రైమ్‌ రేట్‌ పడిపోయినట్లు పోలీ స్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 94శాతం మేర దొంగతనాలు తగ్గాయని, కిడ్నాప్‌ కేసులుసైతం 90శాతం మేర, 75శాతం మిస్సింగ్‌ కేసులు తగ్గాయని పోలీసులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ లేని సమయంలో పోలీసులు అధికశాతం స్టేషన్‌లకే పరిమితం కావడం, కేవలం కొన్ని ప్రాంతాల్లోనే నిఘా ఉండటం జరిగేది. దీనికితోడు ప్రజలు నిత్యం బిజీలైఫ్‌ను గడపడం వల్ల దొంగతనాలు జరిగేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావటం, అడుగడుగునా పోలీసులు బందోబస్తుగా ఉండటంతో క్రైమ్‌ రేటు భారీగా తగ్గినట్లు ఓ పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

Next Story