లాక్‌డౌన్‌తో.. వీళ్లకు పస్తులే!
By Newsmeter.Network Published on 25 March 2020 6:36 AM GMTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వైరస్ భారిన పడి ఇప్పటికే 550మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 11 మంది మృతి చెందారు. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 39 కేసులు నమోదు కాగా.. కరోనా లక్షణాలతో పదుల సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్సలందిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథలపై పడింది.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ కేంద్రాల్లో అనాథలు బిక్షమెత్తుకొని జీవనం సాగిస్తుంటారు. భాగ్యనగరంలో, ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ. 5కే భోజనం సద్వినియోగం చేసుకొని గడిపేవారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో లాక్‌డౌన్ విధించారు. దీంతో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం అందించే రూ. 5 భోజనం క్యాంటిన్లు కూడా బంద్ అయ్యాయి. అప్పుడప్పుడు భోజనాలు తెచ్చి పెట్టే వారు కరువయ్యారు. ఇప్పుడు వీరి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఉంటాని ఇల్లులేక, బిక్షమెత్తుకొని కడుపు నింపుకుందామన్నా రోడ్డెక్కే పరిస్థితి లేకపోవటంతో ఒక్క పూట భోజనం.. కనీసం తాగేందుకు టీ కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు.
కొందరు ఒక పూట తిని సర్దుకుంటుంటే.. ఒక్కోరోజు ఆహారం దొరక్కపోతే నీళ్లు తాగి ఉండిపోతున్నారు. కనిపించిన వారిని డబ్బులు కాకుండా ఆహారం ఉంటే తెచ్చివ్వాలని అడుగుతున్నారు. రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో వీరి పరిస్థితి దారుణంగా ఉంది. పలువురు నీళ్లు తాగి దుకాణాల్లో బ్రెడ్‌లు తీసుకొని తింటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇదే వైరస్‌రా బాబూ.. ఇంకెన్నాళ్లు మాకు ఈ బాధలు అంటూ అనాథలు నిట్టూర్చుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు రోడ్ల వెంబడి బిక్షమెత్తుకొనే కొందరిని అధికారులు ప్రత్యేక హోంలకు తరలించిట్లు తెలుస్తోంది. మొత్తానికి కరోనా వైరస్ పెద్ద స్థాయి వారి నుంచి బిక్షమెత్తుకొనే వారి వరకు ఎవరిని వదలకుండా ఇబ్బందులు గురిచేస్తుంది.